నిర్మల్, మార్చి12(నమస్తే తెలంగాణ) : వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పోలీసుశాఖ భారీ రాయితీ ప్రకటించింది. దీనికి విశేష స్పందన లభిస్తున్నది. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించడంతో వాహనదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. మీ సేవ, ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో క్లియర్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్మల్ జిల్లాలో దాదాపు 4.23 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులున్నాయి. ఇందులో హెల్మెట్ వాడకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, కొవిడ్-19 నిబంధనలు అతిక్రమించడం, మాస్కు ధరించడంలో నిర్లక్ష్యం, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంప్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, నో పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలపడం వంటి కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో మూడేండ్లుగా రూ.18.67 కోట్ల బకాయిన్నట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. ఈ పది రోజుల వ్యవధిలో వాహనదారులు దాదాపు రూ.3 కోట్లు చెల్లించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
గతంలో రూ.5వేలు కట్టిన..
నాకు సొంతంగా కారు ఉన్నది. వివిధ పనుల కారణంగా తరచూ హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు వెళ్తుంటా. ఆరు నెలల క్రితం నా కారుపై ఉన్న పెండింగ్ జరిమానాలు రూ.5వేలు కట్టా. ప్రస్తుతం రూ.2,040 జరిమానా పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పడంతో ఈరోజే మీ సేవలో 50 శాతం రూ.1,030 కట్టా.
– కడారి గంగాధర్, తర్లపాడ్ గ్రామం
మంచి స్పందన ఉంది..
వాహనాలపై విధించిన జరిమానాలపై ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో వాహనదారుల్లో మంచి స్పందన కనిపిస్తున్నది. రోజూ వందల సంఖ్యలో వచ్చి తమ పెండింగ్ చలాన్లు చెల్లిస్తున్నారు. జరిమానా చెల్లించినప్పటికీ ఆర్టీఏ ఎం వ్యాలెట్ యాప్‌లో ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నదని ఫిర్యాదులు వచ్చాయి, మీ సేవ రసీదును దగ్గర ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
– తోట ప్రవీణ్, మీ సేవ నిర్వాహకుడు, నిర్మల్
సద్వినియోగం చేసుకోవాలి..
పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించడంతో వాహనదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. టూ, త్రీ వీలర్స్‌కు 25 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, కార్లు, ఇతర వాహనాలకు 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ttps://echallan. tspolice.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లి అందులో వాహనం నంబర్‌ను ఎంటర్ చేయగానే పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కనిపిస్తాయి. ఎస్బీఐ, ఫోన్ పే, టీ వ్యాలెట్, గూగుల్‌పే, పేటీఎంతోపాటు ఇతర బ్యాంకుల ద్వారా చలాన్లు చెల్లించవచ్చు. ఈ నెలాఖరు తర్వాత రాయితీ వర్తించదు. వాహనదారులందరూ వినియోగించుకోవాలి.
– చల్లా ప్రవీణ్‌కుమార్, ఎస్పీ, నిర్మల్