కుభీర్, డిసెంబర్ 04 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని జాంగామ్ సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికలలోనూ సర్పంచును ఏకగ్రీవంగా మైనారిటీ నాయకుడు ముజాహిద్ ఖాన్‌ను ఎన్నుకున్నారు. రెండు పర్యాయాలు ఓటింగ్ లేకుండా సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయడంతో జిల్లాలోనే ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామంలో జనాభా సుమారు 1200 ఉండగా ఇందులో ముస్లిం మైనారిటీల జనాభా 400 వరకు ఉంది. కాగా ఓటర్ల సంఖ్య 820 ఉండగా ఇందులో ముస్లిం మైనార్టీల ఓటర్లు 220 ఉన్నారు.
స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో జాంగామ్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామానికి మొట్టమొదటి సర్పంచ్ గా మైనార్టీ నాయకుడు ముజాహిద్ ఖాన్ గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకొని మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచారు. మళ్లీ ప్రస్తుతం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతుండంతో రెండో పర్యాయం కూడా గ్రామానికి చెందిన విద్యావంతురాలు మాన్కూర్ నవనీతను సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకొని గ్రామస్తులు చరిత్ర సృష్టించారు.
ఉప సర్పంచ్‌గా మాగాం రాజేశ్వర్ ను, మరో ఏడుగురు గ్రామస్తులను వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిన్న జీపీ అయినప్పటికి వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణాలు 60 శాతం వరకు పూర్తి అయ్యాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూలీలందరూ సద్వినియోగం చేసుకోవడం, ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకోవడంలో ఈ గ్రామం ముందు వరుసలో కొనసాగుతుంది.