కాసిపేట : సింగరేణి కల్యాణి గని( Singareni Kalyani) ఓపెన్ కాస్ట్లో నష్టపోయిన దుబ్బగూడెం గ్రామస్తులకు ఏర్పాటు చేస్తున్న ఆర్అండ్ఆర్( R and R) పునరావస కాలనీలో వసతులు( Facilities ) కల్పించకుండా నిర్లక్ష్యం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని పెద్దనపల్లి శివారులో సింగరేణి చేపడుతున్న ఆర్అండ్ఆర్ కాలనీలో అధికారుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని, అనేక సార్లు ఆర్డీవో, జీఎంకు వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి వసతులు కల్పించడం లేదని మండి పడ్డారు.
ప్రజలకిచ్చిన హామీలు ఎగ్గొట్టేందుకుచూస్తున్నారని విమర్శించారు. అధికారులు మారినప్పుడల్లా వినతిపత్రాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఆర్ఆండ్ఆర్ కాలనీ పూర్తి అయ్యే వరకు ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. దుబ్బగూడెం నిర్వాసితుల స్థలాలకు చాలా వరకు పరిహారం అందించడం లేదన్నారు.
పెరడి భూములకు ఇస్తామన్న పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజన్సీలో ఎస్సీ, బీసీలకు చెందిన ఇంటి పరిసర భూములకు పరిహారం ఇవ్వబోమని అనడం సరికాదన్నారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ నాయకులు గోనెల శ్రీనివాస్, శ్రీలత, గ్రామస్థులు సుమలత, రామటెంకి వినయ్, నస్పూరి ప్రశాంత్, వెంబడి లక్ష్మీ, పద్మ, బిజ్జూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.