తాండూర్: ఇటీవల ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ ( SIR ) ప్రక్రియలో నమోదైన స్థానికేతురుల ( Non-locals ) పేర్లను తొలగించాలని మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని మాదారం టౌన్ షిప్ బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) డిమాండ్ చేశారు. గురువారం సర్ ప్రక్రియకు సంబంధించి సర్పంచ్ కుష్నపల్లి లక్ష్మణ్ ( Laxman ) ఆధ్వర్యంలో అధికారులతో కలిసి నిర్వహించిన గ్రామసభ వాడి వేడిగా కొనసాగింది.
కాంగ్రెస్ నాయకుడు ఓటర్ల జాబితా చదువుతుండగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జాబితాను అధికారులు చదివారు. గ్రామ సభ విషయం కార్యదర్శి సైతం తమకు సమాచారం ఇవ్వలేదని బీఎల్ఎలు నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి ప్రాంతం కావడంతో చాలా మంది ఇక్కడ నుంచి వెళ్లిపోయారని వారి పేర్లను బీఎల్వోలు, అధికారులు స్థానికేతరుల పేర్లను జాబితాలో ఉంచడం సరికాదన్నారు.
కాంగ్రెస్ నాయకులు కొందరు స్థానికేతరుల పేర్లు ఇక్కడే ఉంచేలా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ అలా జరిగితే తాము కలెక్టర్‌కు, ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మాదారం టౌన్ షిప్ లో బెల్ట్ షాపుల వల్ల ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువులు సైతం రోడ్డుపైన ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పలువురు సభ దృష్టికి తీసుకువచ్చారు.