ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 9 : కంటి వెలుగు కార్యక్రమం ద్వారా నిరుపేదలకు మేలు జరుగుతుందని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ అన్నారు. మండలంలోని ఏందా గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని గురువారం వైస్ ఎంపీపీ దావులే బాలాజీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. ఈ శిబిరానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. పేదల కండ్లల్లో వెలుగు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం రెండో విడుత ప్రారంభించారని పేర్కొన్నారు. కంటి సమస్యలున్న వారు ఎన్నో ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో దవాఖానలో చూపించుకోలేకపోతున్నారని, అలాంటి వారికి ఇది అద్భుతమైన అవకాశమన్నారు. కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు, కంటి అద్దాలు అందజేస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో రజినీకాంత్, వైద్యులు సందీప్ కుమార్, ప్రవీణ్, సూపర్వైజర్ కృపా, ఏఎన్ఎం వనిత, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, సిబ్బంది సందీప్, శ్రీరాం, సజన్, సిబ్బంది పాల్గొన్నారు.
నేరడిగొండ, ఫిబ్రవరి 9 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్నది. మండలంలోని రోల్మామడ గ్రామంలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని నిర్వహించినట్లు వైద్యురాలు స్వప్న తెలిపారు. ఇందులో 162 మందికి పరీక్షలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కంటి సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు కో ఆర్డినేటర్ రాంనరేశ్, సిబ్బంది శ్రీనివాస్‌రెడ్డి, సాయన్న, అమ్మీబాయి, నాయకులు అర్క యాదవరావ్, పాఠశాల ఉపాధ్యాయుడు, గ్రామస్తులు పాల్గొన్నారు.
భీంపూర్, ఫిబ్రవరి 9 : మండలంలోని గోముత్రి గ్రామంలో గురువారం 230 మం దికి కంటి పరీక్షలు చేశారు. 14 మందికి కళ్లద్దా లు అందించారు. 22 మంది కోసం ప్రత్యేక అ ద్దాలు ఆర్డర్ చేశారు. కాగా.. మూడు రోజుల్లో ఈ గోముత్రి గ్రామంలోనే 800 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయసారథి, అశ్విని, హెచ్‌ఈవో లింగంపల్లి జ్ఞానేశ్వర్, సిబ్బంది గంగాధర్, శివాణి, శ్రీకాంత్, సుజాత, సర్పంచ్ వేణు యాదవ్, అంగన్వాడీ టీచర్ కవిత పాల్గొన్నారు.
బోథ్, ఫిబ్రవరి 9 : 18 ఏళ్లు పైబడిన గ్రామస్తులంతా కంటి పరీక్షలు చేయించుకోవాలని సొనాల పీహెచ్సీ వైద్యుడు కే నవీన్‌రెడ్డి సూచించారు. మండలంలోని మర్లపెల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని గురువారం సర్పంచ్ కల్లూరి దేవేందర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామంలో శిబిరం ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్తులకు అవగాహన కల్పించి పరీక్షల కోసం తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.