మంచిర్యాల, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాక్షాత్తు ‘అధికార పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ అసెంబ్లీలో ఆర్టీసీ సేవల పునరుద్ధరణపై మాట్లాడినా నేటికీ బస్సు సేవలు ప్రారంభం కాలేదు. గతేడాది డిసెంబర్ 17వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కోటపల్లి మండలంలోని జనగామ రూట్, అదే విధంగా నక్కలపల్లి రూట్లో బస్సులు నడిపించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే వివేక్ కోరారు. వీటితోపాటు చెన్నూర్ నుంచి హైదరాబాద్కు ఉదయం బస్సు నడించాలని కోరారు. ఎమ్మెల్యే సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడడంతో ఆర్టీసీ సేవలు పునరుద్ధరణ అవుతాయని ప్రజలు ఆనందపడ్డారు. కానీ.. అసెంబ్లీలో మాట్లాడి 20 రోజులు గడుస్తున్నా.. ఆర్టీసీ సేవల పునరుద్ధరణ జరగకపోవడంపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామ రూట్లో పారుపల్లి గ్రామం సమీపంలో విద్యుత్ తీగలు బస్సుకు తాకేలా ఉన్నాయని బస్సు సేవలను నిలిపి వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మార్గంలో బస్సు సేవలు నిలిచిపోగా పారుపల్లి గ్రామం నుంచి జనగామ గ్రామం వరకు ఉన్న పది గ్రామాల ప్రజలు రోజు వందల రూపాయలు ప్రైవేట్ వాహనాల యజమానులకు చెల్లిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లి రూట్లోనూ ఆర్టీసీ సేవలు పూర్తిగా నిలిచిపోగా.. నక్కలపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల ప్రజలతోపాటు పక్కనే ఉన్న వేమనపల్లి మండలాల ప్రజలకు ప్రైవేట్ వాహనాలే దిక్కుగా మారుతున్నాయి. ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అతి చిన్న సమస్య కూడా అలానే ఉండడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా..
కోటపల్లి మండలంలోని చెన్నూర్ నుంచి జనగామ రూట్లో ఆర్టీ సీ సేవల పునరుద్ధరణపై ఆ ప్రాంత మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇప్పటికే ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ తీగలు సరిచేస్తే మా రూట్లో బస్సు సేవల పునరుద్ధరణ జరుగుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. వీటితోపాటు బీజేపీ మండల నాయకులు మంత్రి రామయ్య కూడా ప్రజావాణిలో ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే వివేక్ కూడా ఒక అడుగు ముందుకేసి తన నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలోని జనగామ, నక్కలపల్లి రూ ట్లో బస్సు సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. బస్సు సేవల పునరుద్ధరణపై ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా మాట్లాడినా.. నేటికీ ఫలితం లేకపోవడంపై ‘ఇదేం పాలన బాబోయ్’ అంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
బస్సు సేవలను పునరుద్ధరించాలి
కోటపల్లి మండలంలోని జనగామ రూ ట్లో ఆర్టీసీ సేవల పునరుద్ధరణపై కలెక్టర్, ఆర్టీసీ డీఎంకు ఇప్పటికే వినతిపత్రం అందించాం. విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉన్న కారణంగా బస్సులను నడిపించడం లేదని తెలిపారు. ఈ మార్గంలో రోజు పత్తి లోడ్తోపాటు వరి ధాన్యం బస్తాలతో లారీలు వెళ్తున్నా.. ఆర్టీసీ బస్సు నడిపించడానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఎమ్మెల్యే వివేక్ కూడా ఈ సమస్యను అసెంబ్లీ వేదికగా మాట్లాడినా.. నేటి వరకు పునరుద్ధరణ కాలేదు. సమస్య చిన్నదైనా పరిష్కరించే నాథుడు లేక పది గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
చర్యలు తీసుకుంటాం : ఆర్టీసీ డీఎం
గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కోటపల్లి మండలంలోని జనగామ రూట్లో బస్సు ట్రయల్ రన్ నిర్వహించి, బస్సు సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం.