బెల్లంపల్లి, జూలై 9 : బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ గడ్డం ప్రసాద్‌తో తనకు ప్రాణ హాని ఉందని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన న్యాయవాది, నాలుగు నెలల గర్భిణి గడవీణ మమత మంగళవారం రాష్ట్ర హైకోర్టు ఎదుట తన మూడేళ్ల చిన్నారితో నిరసన వ్యక్తం చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మమత తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీకి చెందిన చిప్పరి విక్టోరియా భర్త ఉండగానే ఒంటరి మహిళా పింఛన్ పొందుతున్నదని కలెక్టర్‌కు మమత ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు.
ఈ విషయమై ఆర్పీల సమక్షంలో మాట్లాడుదామని సోమవారం పిలిపించి తమపై విక్టోరియా కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ విషయమై ఆమె బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ గడ్డం ప్రసాద్ తనపై ఒత్తిడి తీసుకువచ్చి కేసు ఉపసహరించుకునేలా చేస్తున్నారని తెలిపారు. తనను బెల్లంపల్లిలో తిరగనివ్వనని, చంపేస్తానని ఫోన్లో బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. దీంతో తాను హైకోర్టుకు వచ్చి నిరసన తెలిపినట్లు తెలిపారు. ఈ విషయమై టూ టౌన్ ఎస్ఐ రమేశ్‌ను వివరణ కోరగా ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారని తెలిపారు.