ఇచ్చోడ, నవంబర్ 27 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మితే రాష్ట్రం ఆగమవుతుందని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చి తర్వాత మాయం అయ్యేవారు కావాలా? ఎల్లప్పుడు మీతో ఉండే నేను కావాలా? ఒకసారి ఆలోచించాలన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అండగా నిలబడి పరిష్కరిస్తానని తెలిపారు.
సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రైతుబంధు రూ.16వేలు, ఆసరా పింఛన్ పెంపు, మహిళలకు రూ.3 వేల జీవన భృతి, రూ.400కే గ్యాస్ సిలిండర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచామన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతమ్ రెడ్డి, ఎంపీటీసీలు సుభాష్, పురుషోత్తం, మాజీ ఎంపీటీసీ రమేశ్, బీఆర్ఎస్ నాయకులు కృష్ణకుమార్, శ్రీనివాస్, పాండు పాల్గొన్నారు.
భీంపూర్, నవంబర్27: బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌కు భీంపూర్ మండలంలోని 26 పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో జనాదరణ కనిపిస్తున్నది. ఆదివారం రాత్రి అంతర్గాంలో ఆయనకు సర్పంచ్ బక్కి లలిత కుటుంబం గజమాల వేశారు. అలాగే సర్పంచ్ కుమారుడు బక్కి కపిల్యాదవ్.. సీఎంగా కేసీఆర్ , ఎమ్మెల్యేగా అనిల్‌జాదవ్ ప్రమాణ స్వీకారం చేసేవరకు పాదరక్షణలు ధరించనని ప్రతిజ్ఞ చేశాడు . సరిహద్దు కరంజి(టీ)లో యువ కొత్త ఓటర్లు తాము జాదవ్ అనిల్‌కే ఓటేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు బక్కి సురేందర్, గడ్డం లస్మన్న, నరేందర్‌యాదవ్ పాల్గొన్నారు.