నేరడిగొండ, ఆగస్టు 22 : ప్రభుత్వ పనుల జాతరలో కార్యక్రమంలో పాత పనులను కాకుండా కొత్తవి మంజూరు చేసి ప్రారంభిస్తే బాగుండేదని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని ఈస్పూర్ గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న పనుల జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, క్యాటిల్ షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పనుల జాతర కార్యక్రమంలో పాత పనులనే ప్రారంభించడంపై గ్రామాల అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నదనేదనేది స్పష్టమవుతున్నదని విమర్శించారు.
ఈస్పూర్ గ్రామం గతంలో వాంకిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేదని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చిన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో ఈస్పూర్ గ్రామ పంచాయతీగా ఏర్పడిందన్నారు. ప్రస్తుతం గ్రామాల అభివృద్ధిని కాంగ్రెస్ హయాంలో గాలికి వదిలేసిందని విమర్శించారు. ఇప్పటికీ పంచాయతీల్లో పాలనలేక అభివృద్ధి కుంటుపడిందన్నారు. గ్రామంలో 100 రోజులు పనిచేసి ఉపాధిహామీ కార్మికులను ఎమ్మెల్యే సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మండల కన్వీనర్ శివారెడ్డి, వీడీసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లె నానక్‌సింగ్, మాజీ సర్పంచ్ జాదవ్ రమేశ్, సాయిరాం, రాజు, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, నాయకులు రాథోడ్ సురేందర్, అనిల్ యాదవ్, గులాబ్‌సింగ్, భారత్, పంచాయతీరాజ్ ఈఈ శివరాం, అదనపు పీడీ కుటుంబరావు, డీఈ ఆడె ధర్మేందర్, ఏఈ రాథోడ్ దినేశ్, ఎంపీడీవో శేఖర్, ఎంఈవో లక్ష్మణ్, ఏపీవో వసంత్‌రావ్, గ్రామస్తులు పాల్గొన్నారు.