Vittal Reddy | ముథోల్ నియోజకవర్గంలో గత పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను మరోసారి గెలిపిస్తాయని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. హ్యాట్రిక్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. బాసర అమ్మవారి ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేశారని, త్వరలోనే గర్భాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. అర్లితో పాటు పిప్రి ఎత్తిపోతల పథకానికి ఇటీవలే సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని, సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
-నిర్మల్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ)
నిర్మల్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నానని, మూడోసారి కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని, హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
విఠల్ రెడ్డి: చాలా సంతోషంగా ఉంది. నాపట్ల నమ్మకం, విశ్వాసం ఉంచి సరస్వతీ మాత ఆశీర్వాదంతో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. గత పదేళ్లుగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో నాటుకుపోయాయి. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నం. దాని వల్లనే ప్రజల మన్ననలను పొందగలిగాం. ప్రజల్లో నా పట్ల ఉన్న సానుకూలతను దృష్టిలో ఉంచుకొనే సీఎం కేసీఆర్ మరో సారి అవకాశం ఇచ్చారని భావిస్తున్న. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.
విఠల్ రెడ్డి: గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో దాదాపు 90 శాతం వరకు నెరవేర్చాను. హామీలివ్వని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేశాం. ప్రతి మండల కేంద్రంలో ప్రజల అవసరాల మేరకు కోట్లాది రూపాయల నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాం. లోకేశ్వరం మండలంలో అర్లి బ్రిడ్జి నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండే. అది కూడా ఇటీవలే మంజూరై జీవో కూడా విడుదలైంది. రూ.46 కోట్ల నిధులతో నిర్మించే ఈ బ్రిడ్జి పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. అలాగే రూ.65 కోట్లతో నిర్మించనున్న పిప్రీ ఎత్తిపోతల పథకం పనులను త్వరలోనే మొదలు పెడతాం. ముథోల్ ప్రాంతవాసుల చిరకాల కోరికైన డిగ్రీ కళాశాల కూడా ఇటీవలే మంజూరైంది. అలాగే కుంటాల మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా అక్కడి ప్రజలు కోరుతూ వచ్చారు. ఇటీవలే జూనియర్ కాలేజీ మంజూరైంది.
విఠల్‌రెడ్డి: తెలంగాణ ఏర్పడక ముందు నియోజకవర్గంలో సాగునీటి రంగంలో ఎత్తిపోతల పథకాలన్నీ పని చేయకుండా పోయాయి. తొలిసారి బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఎత్తిపోతల పథకాలన్నింటికీ మరమ్మత్తులు చేయించి పునరుద్ధరించుకున్నాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన అనేక గ్రామాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటి అందించేందుకు తాజాగా మరో ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. అలాగే వాగులపై చాలా చోట్ల చెక్‌డ్యాంలను నిర్మించాం. కొత్తగా మరో 4 చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి. మిషన్ కాకతీయ ఫేస్ 1, ఫేస్ 2లో 125 చెరువులను బాగు చేసుకున్నం. మిషన్ భగీరథ కింద నియోజకవర్గంలోని 250 శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నాం. భైంసా, ముథోల్, కుభీర్ దవాఖానలను అభివృద్ధి చేశాం. 30 పడకలు మాత్రమే ఉన్న ముథోల్ దవాఖానను అప్‌గ్రేడ్ చేసి ఏరియా దవాఖానగా మార్చాం. కొత్త దవాఖాన భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. భైంసా దవాఖానలో కిడ్నీ రోగుల కోసం ఇటీవలే 5 పడకలతో కూడిన డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అలాగే చాలా గ్రామాలకు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల ఆధ్వర్యంలో కొత్తగా లింక్ రోడ్లను వేశాం. విద్యాశాఖ పర ంగా మన ఊరు – మన బడి పథకంలో భాగంగా మొదటి విడుతలో నియోజకవర్గంలో దాదాపు 100 పైగా పాఠశాలల్లో అదనపు తరగతి గదులతో పాటు, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చడం జరిగింది. రెండో విడుతలో మిగతా స్కూళ్లలో కూడా పనులను ప్రారంభిస్తాం.
విఠల్‌రెడ్డి: గడ్డెన్న వాగు ప్రాజెక్టును గత ప్రభుత్వాలు నిర్మించినా. ఆయకట్టుకు నీరందించేందుకు అవసరమైన కెనాల్స్ నిర్మించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 75 శాతం కాలువల నిర్మాణాన్ని పూర్తి చేశాం. ఇంకా 25 శాతం పనులు చేయాల్సి ఉంది. వచ్చే రెండు, మూడేళ్లలో పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టుకూ సాగునీరందేలా చూస్తాం
విఠల్‌రెడ్డి: ముథోల్ నియోజకవర్గానికి సంబంధించి 28 ప్యాకేజీ పనులు లోకేశ్వరం మండలం కనకాపూర్ వద్ద ప్రారంభం కానున్నాయి. ఈ పనులు పూర్తయితే ముథోల్, తానూర్ మండలాల రైతులకు సాగునీరందనున్నది. అయితే ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు ఏజెన్సీ పనులను అర్ధాంతరంగా నిలిపి వేసింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, త్వరలోనే టెండర్స్ రీకాల్ చేస్తామని హామీ ఇచ్చారు.
విఠల్‌రెడ్డి: అమ్మవారి ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేశారు. వీటిలో దాదాపు రూ. 20 కోట్లతో ఆలయం చుట్టూ ప్రహరీ, అతిథి గృహాల నిర్మాణం, భక్తులు విడిది చేసేందుకు అవసమైన భారీ షెడ్డు తదితర నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే మిగతా నిధులతో గర్భాలయ విస్తరణ పనులు ప్రారంభిస్తాం. శృంగేరి పీఠాధిపతి శ్రీ శంకరాచార్యుల పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతాయి.
విఠల్‌రెడ్డి: బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులను కలుస్తాం. ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం చేరుతున్నది. వారందరూ బీఆర్ఎస్ను గెలిపించి మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే చూడాలనుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోతాం. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకొని సమష్టిగా కృషి చేసి విజయాన్ని సాధిస్తా.