నిర్మల్ అర్బన్, జూన్ 16 : ముందస్తు ప్రణాళికతోనే రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించిందని రాష్ట్ర, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని దివ్య గార్డెన్లో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవానికి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మల్ జిల్లాలో నూతనంగా ఖానాపూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసుకున్నామన్నారు.
మున్సిపాల్టీలను వేగంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో సీఎం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన బల్దియాలకు ప్రతి నెలా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని గుర్తు చేశారు. నిర్మల్ మున్సిపాల్టీకి దాదాపు రూ.80 లక్షలను ప్రభుత్వం జమ చేస్తున్నదని తెలిపారు. 2011 జనాభా ప్రకారం 1,37,000 మంది నిర్మల్ పట్టణంలో ఉన్నారన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా అవసరాలను గుర్తించి సమస్యలను తీరుస్తున్నదని చెప్పారు. పేదల ఆర్థిక ఇబ్బందులను గ్రహించిన ప్రభుత్వం.. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నామన్నారు. అమృత్ పథకం ద్వారా రూ.70 కోట్లలతో ఎస్టీపీ (డ్రింకింగ్ వాటర్)ను త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోనున్నామని పేర్కొన్నారు.
జిల్లాలో రూ.166 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించామని, త్వరలో తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఏటా 100 మంది వైద్యులు ఇక్కడ విద్యను అభ్యసించనున్నారన్నారు. నర్సింగ్ కళాశాల మంజూరు అయిందని, ఇంజినీరింగ్ కళాశాల కూడా విద్యార్థులకు దగ్గర కానుందని తెలిపారు. ఇటీవలే కలెక్టరేట్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామని, అన్ని శాఖల అధికారులు ఒకే చోట నుంచి విధులు నిర్వహించే అవకాశం ఉందన్నారు. స్వయం సహాయ సంఘాలకు మంజూరైన రూ 6.20 కోట్ల చెక్కును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహిళా సంఘాల సభ్యులకు అందించారు. మున్సిపాల్టీలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు కిట్లను అందించారు. బల్దియాల్లో ఉత్తమ విధులు నిర్వహించిన ఉద్యోగులను జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో సన్మానించారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, బిట్లింగ్ నవీన్, నాయకులు అడ్ప పోశెట్టి, నర్సాగౌడ్, కోటగిరి అశోక్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.