దశాబ్దాలుగా వెట్టిచాకిరీకి గురైన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల(వీఆర్ఏ)కు విముక్తి లభించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో ఆత్మగౌరవం పెరిగింది. ఉద్యోగ భద్రతతోపాటు వేతనం కూడా భారీగా పెరగనుండడంతో వారి కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. వీరి అర్హతను బట్టి ఆఫీస్ సబార్డినేట్స్, రికార్డు అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లుగా నియమించారు. వ్యవసాయ, విద్య, మత్స్య, ఇరిగేషన్, మున్సిపల్, మెడికల్ ఎడ్యుకేషన్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, రెవెన్యూ, టెక్నికల్ ఎడ్యుకేషన్, కాలేజీయేట్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ శాఖల్లో 1,952 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. దీనికి సంబంధించి గురువారం నిర్మల్ జిల్లాకు సంబంధించి అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నియామకపత్రాలను వీఆర్ఏలకు అందించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మంచిర్యాల, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు పలువురు వీఆర్ఏలు నియామక పత్రాలు అందుకున్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి విద్యార్హతను అనుసరించి మూడు కేటగిరీలుగా కేటాయింపులు చేశారు. పదో తరగతి చదివిన వారిని ఆఫీస్ సబార్డినేట్స్‌గా, ఇంటర్ పూర్తి చేసిన వారిని రికార్డ్ అసిస్టెంట్లుగా, ఆపై చదువు పూర్తి చేసిన వారిని జూనియర్ అసిస్టెంట్లుగా నియమించారు. వ్యవసాయ, విద్య, మత్స్య, ఇగిరేషన్, మున్సిపల్, మెడికల్ ఎడ్యుకేషన్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, రెవెన్యూ, టెక్నికల్ ఎడ్యుకేషన్, కాలేజీయేట్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్.. ఇలా వివిధ శాఖల్లో వీఆర్ఏలకు పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 1,952 మంది కేటాయింపులు పూర్తయ్యాయి. వీరిలో 61 ఏండ్లు దాటిన వారికి మరో వారం, పది రోజుల్లో పోస్టింగులు ఇవ్వనున్నారు. గురువారం నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా కొందరికి పత్రాలు పంపిణీ చేశారు.
కేసీఆర్‌తోనే సాధ్యమైంది..
మొన్నటి వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏలను కేవలం పార్ట్ టైం ఉద్యోగులుగానే పరిగణించేవారు. వచ్చే కొద్దిపాటి గౌరవ వేతనంతో నెట్టుకువచ్చేవారు. కనీసం నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్ని పోరాటాలు చేసినా సమైక్య పాలనలో గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ.. తెలంగాణ వచ్చిన వెంటనే 2015లో సీఎం కేసీఆర్ వీఆర్ఏలను హైదరాబాద్ పిలిపించుకొని రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారు. అప్పటి దాకా రూ.6వేలు ఉన్న గౌరవ వేతనాన్ని రూ.10,500కు పెంచారు. అప్పుడెప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు మమ్ములను రెగ్యులర్ చేయడంతోపాటు నియామక పత్రాలు అందజేశారు. ఇది సీఎంకేసీఆర్తోనే సాధ్యమైంది. ఆయన స్థానంలో మరెవరున్నా ఇది కాకపోతుండే అని వీఆర్ఏలు సంబురపడుతున్నారు. మాకు మా కుటుంబాలకు బంగారు భవిష్యత్ ప్రసాదించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. ఈ నేపథ్యంలో నియామక పత్రాలు అందుకున్న వీఆర్ఏలు ‘నమస్తే తెలంగాణ’తో తమ సంతోషాన్ని పంచుకున్నారు.
వేరే జిల్లాల నుంచి కొందరు..
కేటాయింపుల్లో భాగంగా ఇతర జిల్లాలకు చెందిన వీఆర్ఏలకు కొందరికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోస్టింగ్‌లు ఇచ్చారు. మంచిర్యాల జిల్లాకు 43 మంది జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల నుంచి రానున్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు నిజామాబాద్ నుంచి 17 మంది, భూపాలపల్లి నుంచి 31 మంది, ఆదిలాబాద్ జిల్లాకు నిజామాబాద్, నిర్మల్ నుంచి 22 మందిని కేటాయించారు.