ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా ( కె ) ( Mukra ) గ్రామస్థులు మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) కు పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గురువారం గ్రామస్థులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి గ్రామంలో దళితులకు చేసిన మేలును గుర్తు చేసుకున్నారు.
గ్రామంలో దళిత బస్తీ పథకంలో దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 ఎకరాలు భూమి ఇచ్చి కూలీలుగా ఉన్న వారిని రైతులుగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. దళితుల కోసం దళిత బంధు పథకం పెట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది అని వెల్లడించారు. దళిత డిక్లరేషన్ పేరిట దళితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు.
ఎన్నికల్లో దళితులకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది , అధికారంలో వచ్చాక హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఎవరు దరఖాస్తు పెట్టకుండానే ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు వచ్చిందని, పెండ్లి అయినా ఆడపిల్లకు కల్యాణలక్ష్మి ఇచ్చాడని, రైతు చనిపోతే 5 లక్షలు రైతు బీమా , బాలింతలకు కేసీఆర్ కిట్ , ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజలను ఆదుకొన్న గొప్ప మనస్సు ఉన్న కేసీఆర్ అని ప్రశంసించారు.
రేవంత్ రెడ్డి మాత్రం 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు అమలు చేస్తానని చెప్పి 1000 రోజులు అవుతున్న అమలు చేయక మోసం చేస్తున్నాడని, తమ బ్రతుకులు మారాలంటే కేసీఆర్ సారే రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, తిరుపతి, విఠల్, మారుతి, దత్త, ప్రహ్లాద్, గ్రామస్థులు పాల్గొన్నారు.