సీసీసీ నస్పూర్, నవంబర్ 12: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన సీసీసీ నస్పూర్ పోలీస్ సేష్టన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీకి పోలీస్ అధికారులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. స్టేషన్లో సిబ్బందితో మాట్లాడి రిసెప్షన్, సీసీ టీఎన్ఎస్ విభాగాల పనితీరు, శాఖాపరమైన సమస్యలను సీపీ తెలుసుకున్నారు. రౌడీషీటర్లు, అనుమానితులు, కేడీలు, డీసీలు, మిస్సింగ్, ప్రాపర్టీ నేరాలు, పెండింగ్ కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ఫిర్యాదుదారులపై మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, కాలనీల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి ప్రజలకు భద్రత కల్పించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 15న జరిగే లోక్ అదాలత్ సందర్భంగా ఇరువర్గాల వారితో మాట్లాడి రాజీపడే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్ఐ ఉపేందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.