ఎదులాపురం, మే 26 : హెపటైటిస్ (కాలేయ సంబంధిత వైరస్) వ్యాధి ఒకరి నుంచి మరొకరికి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆలస్యం చేస్తే కాలేయానికి క్యాన్సర్ సోకి మనిషి మృత్యువాతపడే ప్రమాదముంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం హెపటైటిస్ నియంత్రణకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వైర్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది. ఇందుకోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్ పాత ఓపీ భవనంలో రూం నంబర్ 60లో ప్రత్యేకంగా చికిత్స గదిని ఏర్పాటు చేశారు. హెపటైటిస్ నియంత్రణ, వ్యాప్తి, లక్షణాలపై ప్రత్యేక కథనం
హెపటైటిస్ ఎలా వస్తుంది…
రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో హెపటైటిస్ వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి తీవ్రత హెచ్ఐవీ కంటే వందరేట్లు అధికంగా ఉంటుంది. కాలేయానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడవచ్చు. సకాలంలో చికిత్స తీసుకోకుంటే క్యాన్సర్‌గా మారుతుంది. ఇప్పటికే ముగ్గురికి హెపటైటిస్ బి సోకగా, హెపటైటిస్ సి బారినపడ్డ ఆరుగురు రిమ్స్‌లోని డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరిలో జిల్లా జైలులో 158 మంది ఖైదీలకు పరీక్షలు చేయగా అందులో ఇద్దరికి హెపటైటిస్ బి నిర్ధారణ అయింది. వైద్యులు వారికి వ్యాక్సినేషన్ వేస్తున్నారు. నిర్ధారణ అయిన సమయంలో, మొదటి డోస్, నెలకు రెండో డోస్, ఆరు నెలలకు బుస్టర్ డోసులు వేయనున్నారు.
వ్యాధి లక్షణాలు ఇవి…
ఆలసట, బరువు తగ్గడం, జ్వరం రావడం, చర్మంపై మచ్చలు ఏర్పడడం, ముదురు రంగులో మూత్రం రావడం, కడుపు నొప్పి, వాంతులు, ఆకలి మందగించడం, నీరసంగా ఉండడం లక్షణాలు ఉంటాయి.
జిల్లాలో 52 కేసులు నమోదు..
ఆదిలాబాద్ జిల్లాలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 9791 మందికి పరీక్షలు చేయగా ఇందులో (44) హైపటైటిస్ బి, హైపటైటిస్ సి, (8) కేసులు నమోదు అయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నారు.
ప్రత్యేక టీం ఏర్పాటు
రిమ్స్‌లో ప్రత్యేక హెపటైటిస్ నివారణ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఇందులో నోడల్ ఆఫీసర్‌గా డాక్టర్ తానాజీ, ఫార్మాసిస్టు రాష్ట్రపాల్, ల్యాబ్‌టెక్నిషియన్ సంతోషిణి, కంప్యూటర్ ఆపరేటర్ కవిత, హెల్త్ కేర్ ప్రొవైడర్ దత్తు ఉన్నారు.
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రజలకు హెపటైటిస్పై అవగాహన అవసరమం. లక్షణాలు ఉన్న వారు భయపడకుండా హెపటైటీస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఇది కేవలం రక్త పరీక్ష ద్వారానే నిర్ధారణ అవుతుంది. హెపటైటీస్ బీ,సీ ఉన్నట్లు నిర్ధారణ అయితే ప్రాథమిక దశలోనే చికిత్స అందిస్తే క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చు.
–డాక్టర్ జాడె తానాజీ ,నోడల్ ఆఫీసర్