మంచిర్యాల అర్బన్ : పోలీస్ ఉద్యోగం (Police Job) అనేక సవాళ్లతో కూడినదని, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్(DCP Bhasker) అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో మంచిర్యాల టచ్ హాస్పిటల్ ( Touch Hospital ) ఆధ్వర్యంలో పోలీసులకు కార్డియాలజీ స్క్రీనింగ్‌కు సంబంధించిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెకటేశ్వర్పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగంలో ఒత్తిడిలు ఉంటాయని, పోలీస్ ఉద్యోగంలో అవి సహజమని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలని సూచించారు. పోలీసులు పిల్లల్ని, కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడపాలన్నారు. ఇటీవల కాలంలో రిటైర్ అయినా ఎస్ఐ రాములు అందించిన సేవలను అభినందించారు.
మన ఆలోచన పద్ధతులు, అలవాట్లను మార్చుకొని, ఆర్థిక స్థోమత తగ్గట్టు జీవితాన్ని సంతోషంగా గడపాలని సూచించారు. క్రమ శిక్షణ లేని కారణంగా ఎక్కువగా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారని పేర్కొన్నారు. గుండెకు, ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లో సొంత వైద్యం చేసుకోరాదని సూచించారు. ఈ శిబిరం లో ప్రతి రోజూ 20 మందికి చొప్పున దాదాపు 500 మంది సిబ్బంది కి ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
టచ్ ఆసుపత్రి గుండె వైద్య నిపుణుడు రాజేష్ బుర్కండే గుండె సంబంధిత వ్యాధులపై పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టచ్ ఆసుపత్రి వైద్యులు వికాస్, సీఈవో రాజ్ పాల్, శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు శేఖర్, జీవన్ రెడ్డి, మాటెటి శ్రీనివాస్, , సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.