పాఠశాల విద్యపై కేంద్ర విద్యాశాఖ ఇచ్చే పీజీఐ-డీ (ఫెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్- డిస్ట్రిక్స్) గ్రేడింగ్‌లో మంచిర్యాల జిల్లా సత్తా చాటింది. 2017-18 నుంచి 2024-25 వరకూ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రేడింగ్‌లు ఇవ్వగా, దేశంలోనే ఉత్తమ్-3 గ్రేడింగ్ సాధించి గ్రేట్ అనిపించుకున్నది. ఇక రాష్ట్రంలో జనగామ జిల్లాకు మొదటి స్థానం రాగా, మంచిర్యాల జిల్లా రెండో స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది.
మంచిర్యాల, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాఠశాల విద్యలో మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యాబోధన వసతుల కల్పన, ఉపాధ్యాయుల అందుబాటు.. ఇలా వివిధ అంశాల ఆధారంగా ఇచ్చే పీజీఐ-డీ గ్రేడింగ్‌లో మంచిర్యాల జిల్లా సత్తా చాటింది. కేంద్ర విద్యాశాఖ దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 784 జిల్లాల్లో పాఠశాల విద్య ఎలా ఉందని విషయమై ఫెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్- డిస్ట్రిక్స్(పీజీఐ-డీ) గ్రేడింగ్ ఇస్తున్నది. 2017-18 నుంచి 2024-25 దాకా పాఠశాల విద్యలో పనితీరును ఆధారంగా ఇచ్చిన గ్రేడింగ్‌లో మంచిర్యాల జిల్లా ఉత్తమ్-3 గ్రేడింగ్ సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు జిల్లాలు ఈ గ్రేడింగ్‌ను సాధించగా, 383 స్కోర్‌తో జనగామ జిల్లా మొదటిస్థానం, 360 స్కోర్‌తో మంచిర్యాల రెండోస్థానంలో నిలిచి మెరిసింది.
పాఠశాల విద్యలో వివిధ అంశాల ఆధారంగా ఇచ్చే గ్రేడింగ్‌లో మొత్తంలో 600 స్కోర్ సాధించాల్సి ఉండగా, ఈ టార్గెట్‌లో 90శాతం చేరుకున్న వారికి ఉత్కర్ష్ గ్రేడింగ్ ఇస్తారు. ఇప్పటి దాకా దేశంలో ఏ జిల్లా కూడా ఈ గ్రేడ్‌ను సాధించలేదు. అంటే ఆ స్థాయికి పాఠశాల విద్యా వ్యవస్థ ఇంకా చేరుకోలేదు. ఇక మొత్తం టార్గెట్‌లో 81శాతం నుంచి 90శాతం సాధించిన జిల్లాకు ఉత్తమ్-1 గ్రేడింగ్ ఇస్తారు. దేశంలోని 784 జిల్లాల్లో కేవలం 16 జిల్లాలు ఈ గ్రేడ్‌ను అందుకున్నాయి. ఇక 71 శాతం నుంచి 80 శాతం స్కోర్‌కు చేరుకుంటే ఉత్తమ్-2 గ్రేడింగ్ ఇస్తారు. 19 జిల్లాలు ఈ గ్రేడ్‌ను సాధించాయి. ఇక 61శాతం నుంచి 70 శాతం స్కోర్ సాధించిన జిల్లాలకు ఉత్తమ్-3 గ్రేడింగ్ ఇస్తారు. దేశంలో మొత్తంగా తెలంగాణ నుంచి రెండు జిల్లాలు జనగామ, మంచిర్యాల ఉత్తమ్-3 గ్రేడ్‌ను అందుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో మిగిలిన మూడు జిల్లాలు 51శాతం నుంచి 60శాతం స్కోర్‌తో ప్రచేస్తా-1 గ్రేడింగ్‌లో నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలు ఉండగా, 41శాతం నుంచి 50శాతం స్కోర్‌కు ఇచ్చే ప్రచేస్తా-2 గ్రేడింగ్‌లో ఆదిలాబాద్ జిల్లాలు నిలిచాయి.

ఇవే కొలమానం..
ఫెర్ఫామెన్స్ గ్రేడిండ్ ఇండెక్స్- డిస్ట్రిక్స్(పీజీఐ-డీ)లో గతంలో 324 స్కోర్‌తో ప్రచేష్ట విభాగంలో ఉన్న మంచిర్యాల జిల్లా ఈ ఏడాది 360 స్కోర్‌ను సాధించి ఉత్తమ్ గ్రేడింగ్‌లో చోటుసాధించింది. ఆరు సూచికల్లో జిల్లాకు వచ్చిన స్కోర్లను చూసుకుంటే.. ఔట్‌కమ్స్-ఫలితాలు(అభ్యసన ఫలితాలు, నాణ్యత, ఉపాధ్యాయుల లభ్యత, వృత్తిపరమైన అభివృద్ధి)లో 290 స్కోర్‌కు గాను 151 స్కోర్ సాధించింది. సమర్థవంతమైన తరగతి గది(అభ్యాస నిర్వహణ, అభ్యాస సుసంపన్న కార్యకలాపాల్లో) 90 స్కోర్‌కు గాను 65, మౌలిక సదుపాయాలు, వసతులు, విద్యార్థుల హక్కులలో 51కి 44, పాఠశాల భద్రత, పిల్లల రక్షణలో 35కి 29, డిజిటల్ లర్నింగ్‌లో 50కి 26, పాలన ప్రక్రియలు(నిధుల సమీకరణ, వినియోగం, హాజరు పర్యవేక్షణ వ్యవస్థలు, పాఠశాల నాయకత్వ అభివృద్ధి)లో84కి గాను 45స్కోర్ మొత్తం 600 స్కోర్‌కు 360 స్కోర్ సాధించి రాష్ట్రంలోనే టాప్-2గా నిలిచింది.
రూ.150 కోట్లు ఖర్చు.. కలెక్టర్ ప్రత్యేక చొరవ..
సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించి, నాణ్యమైన విద్యను అందించడంపై కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పాఠశాల విద్యలో సమూలమైన మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లారు. 320 మంది కొత్త ఉపాధ్యాయుల నియామకం, టీచర్స్‌కు ముఖ గుర్తింపు హాజరు తీసుకురావడంతో పాటు స్కూళ్లలో ఏం జరుగుతుందో నిత్యం మానిటర్ చేస్తూ వచ్చారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్య సైతం 3 శాతం పెరిగింది. మంచిర్యాల జిల్లాలో 700 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, దాదాపు 44వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
జిల్లా కలెక్టర్‌గా కుమార్ దీపక్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి దాకా రూ.150 కోట్లు కేవలం పాఠశాల విద్యపైనే ఖర్చు చేయడం గమనార్హం. సీఎస్ఆర్ ఫండ్స్ రూ.80 కోట్లు, ఈజీఎస్ రూ.20 కోట్లు, సమగ్ర శిక్ష రూ.11కోట్లు, నాబార్డ్ రూ.6 కోట్లు, ప్రధానమంత్రి జన్మన్ రూ.3 కోట్లు, ప్రధానమంత్రి జుగా రూ.3కోట్లతో పాటు ప్రభుత్వ పరంగా రావాల్సిన ఇతర నిధులతో పాటు ఇతర మార్గాల ద్వారా నిధులను సమకూరుస్తున్నారు. పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, విద్యార్థిని విద్యార్థులకు టాయిలెట్స్ నిర్మాణం, భోజన శాలలు, అదనపు తరగతి గదులు, ప్రహరీలతో పాటు డిజిటల్ లర్నింగ్ సదుపాయల కల్పనను కృషి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీపై శిక్షణలు ఇస్తుండటంతో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కిల్స్ పెరిగి, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించే దిశగా అడుగులు పడుతున్నాయి.
పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి
పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించాం. కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాక దాదాపు రూ.150 కోట్లు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా స్కూళ్లపై ఖర్చు పెట్టాం. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చాం. జిల్లాలో వందల స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చేశాం. ఉపాధ్యాయలు హాజరు మెరుగుపరచడంతో పాటు వారిలో నైపుణ్యాల అభివృద్ధికి ఇచ్చే శిక్షణలను అందిపుచ్చుకున్నాం. గతంతో పోలిస్తే స్కూల్స్‌పై మానిటరింగ్ పెంచాం. జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు మాకు ఎంతగానో సహకరించారు. ఉత్తమ్-3 గ్రేడింగ్ సాధించడంలో పాఠశాల విద్య శాఖ అధికారుల సహకారం సైతం ఉంది. మంచిర్యాల జిల్లా ఉత్తమ్-3 గ్రేడింగ్‌లో రెండోస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మెరుగైన గ్రేడింగ్ సాధించేలా ప్రణాళికతో ముందుకు వెళ్తాం.
– కుమార్ దీపక్, మంచిర్యాల జిల్లా కలెక్టర్