నస్పూర్, సెప్టెంబర్ 5 : గురువులే మార్గ నిర్దేశకులని, విద్యార్థులను సన్మార్గంలో నడిపించి వారికి భవిష్యత్నిచ్చేది వారేనని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
డీఈవో యాదయ్య, జడ్పీసీఈవో గణపతి, వయోజన విద్యాధికారి పురుషోత్తంనాయక్, జిల్లా మైనార్టీ అధికారి రాజేశ్వరితో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్వేపల్లి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.ఉత్తమ సేవలందించిన 43 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.