నార్నూర్ : వాగును దాటుతూ వరదలో చిక్కుకుపోయిన ముగ్గురిని కాపాడి ( Rescu) వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గ్రామస్థుడు మృతి చెందిన ఘటనతో గ్రామంలో విషాదం నెలకొని ఉంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ( Narnoor ) మండలం మల్లంగి గ్రామంలో జరిగిన ఘటన వివరాలను పోలీసులు, స్థానికులు వెల్లడించారు.
గ్రామానికి చెందిన జాదవ్ కృష్ణ, జాదవ్ మిథున్, జాదవ్ మిట్టు వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా సమీపంలోని పెద్ద వాగు ( Peddavagu) దాటే క్రమంలో వాగులో చిక్కుకున్నారు. దూరం నుంచి గమనించిన అదే గ్రామానికి చెందిన జాడే శంకర్ వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా ఒక్కసారిగా వచ్చిన ప్రవాహంతో ఆయన అందులో కొట్టుకుపోయి మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ జాడి రాజాలింగం, నార్నూర్ ఎస్సై అఖిల్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకుని పంచనామా చేశారు. గాలింపు చర్యల అనంతరం లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరారు.