ఆదిలాబాద్ రూరల్, జూలై 14 : వయోజనులు విధిగా ఓటు హక్కునమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం ప్రత్యేక ఓటర్ల నమోదు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి అభినందించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఓటు హక్కు నమోదుకు ఈనెల 15వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడానికి బైక్ ర్యాలీ, ముగ్గుల పోటీలు చేపట్టామన్నారు.
ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యుల ఓటు హక్కు వివరాలను https://www.nvsp.in పోర్టల్‌లో ఎపిక్ నంబర్‌తో పరిశీలించుకోవాలన్నారు. సాంకేతిక, ఇతర కారణాల వలన ఓటు హక్కు తొలగించినట్లయితే, శనివారంలోగా ఫారం-6 పూరించి సంబంధిత పోలింగ్ కేంద్రంలోని బూత్ స్థాయి అధికారులు, తహసీల్దార్ కార్యాలయంలో అందజేసి ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.