కౌటాల/చింతలమానేపల్లి, జూలై 18 : కేసీఆర్ సర్కారు హయాంలోనే సిర్పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్-2 గ్రామ సమీపంలో రూ. 57 కోట్లతో నిర్మించిన 132/33 సబ్‌స్టేషన్ పనులు పూర్తయి అందుబాటులోకి రావడంతో కోనప్ప అభిమానులు అక్కడికి చేరుకొని సంబురాలు జరుపుకొన్నారు.
అంతకుముందు కౌటాల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కోనేరు కోనప్ప మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట, కాగజ్‌నగర్ మండలాలకు 12 సబ్స్టేషన్లను మంజూరు చేయించామని, ప్రస్తుతం నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయన్నారు. యూరియా కొరతతో పాటు వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేసిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
ప్రస్తుతం నియోజక వర్గంలో పత్తి కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ నడిచిందని, రైతులను కోట్లల్లో మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతులకు వానకాలంలో యూరియా అందించడంలో తీవ్రంగా విఫలమైందన్నారు. కాగా, కోనప్ప కార్యకర్తలు కౌటాల బస్టాండ్ నుంచి 132 /33 కేవీ సబ్‌స్టేషన్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ తీశారు. సబ్‌స్టేషన్ ఎదుట కోనప్ప చిత్రపటానికి పాలాభిషేకం చేసి పటాకులు కాల్చారు. అక్కడ ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్..’, ‘జై కోనప్ప’ అని నినాదాలు చేశారు.