నిర్మల్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) :‘నేను గిరిజన బిడ్డను. మీలో ఒకడిగా తండాలు, గూడేల్లో తిరిగా. మీ కష్టాలను చూసి చలించా. మీకు ఏదైనా చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చా. నాపై నమ్మకంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పంపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా. ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేశా, చేస్తున్నా. ఖానాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తా. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తా. మేజర్ పంచాయతీగా ఉన్న జన్నారాన్ని మున్సిపాలిటీగా మారుస్తా. ఇంద్రవెల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తా. ఫలితంగా గిరిజనులు వ్యాపారవేత్తలుగా ఎదగడంతోపాటు యువతకు ఉపాధి, రైతులకు అధిక ఆదాయం సమకూరుతుంది.’ అని ఖానాపూర్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై నమ్మకం ఉంచి ఖానాపూర్ టికెట్ కేటాయించడం సంతోషంగా ఉంది. గిరిజన బిడ్డగా తనకు అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆశీర్వాదాన్ని కోరుతా. ఉమ్మడి రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో నిధులు రాలేదు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగింది. నేను గెలిచిన తర్వాత రాబోయే రోజుల్లో అభివృద్ధి సాధించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తా. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ముఖ్యంగా ఖానాపూర్‌ను రెవెన్యూ డివిజన్, జన్నారం పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తా. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ఇంద్రవెల్లి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటునకు కృషి చేస్తా. సోయా పరిశ్రమ ఏర్పాటు వల్ల యువతకు ఉపాధి లభించడంతోపాటు రైతుల ఆదాయం రెట్టింపవుతుంది’ అని ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. బీఆర్ఎస్ టికెట్ వచ్చిన సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే : బీఆర్ఎస్ టికెట్ దక్కడంపై ఎలా ఫీలవుతున్నారు?
జాన్సన్ : బీఆర్ఎస్ టికెట్ రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నా పూర్వజన్మ సుకృతం. నాపై నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి జరిగింది. నేను దాదాపు 25 దేశాలు తిరిగా. ఎక్కడ కూడా ఇలాంటి పథకాలు లేవు. ప్రపంచంలో వ్యవసాయం పైనే ఆధారపడ్డ అనేక దేశాలు ఉన్నాయి. మన దగ్గర రైతుల కోసం అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఉచిత కరెంటు వంటి ఒక్క పథకం కూడా ప్రపంచంలోని ఏ దేశంలోనూ అమలు కావడం లేదు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరిచ్చిన నాయకుడు కేసీఆర్.
నమస్తే : స్థానికేతరుడు అన్న అభిప్రాయం ఉంది. ఎలా అధిగమిస్తారు?
జాన్సన్ : నేను గిరిజన బిడ్డను. మా ముత్తాతలు ఖానాపూర్‌కు చెందిన వారు. మా నానమ్మది ఇదే నియోజకవర్గంలోని ఉడుంపూర్. అప్పట్లో మా తాతలు పొట్ట చేత పట్టుకొని జగిత్యాల జిల్లాలో(అప్పటి కరీంనగర్) జొన్నలు బాగా పండుతాయని జీవనోపాధి కోసం వెళ్లారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎలాంటి అంశాలు లేవు. లోకల్, నాన్‌లోకల్ అంశాన్ని రాద్ధాంతం చేసి ప్రయోజనం పొందాలనుకుంటున్నాయి.
నమస్తే : ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు?
జాన్సన్ : నేను 25 ఏళ్లుగా వ్యాపారవేత్తగా ఉంటూనే, అనేక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా. నా ఖానాపూర్‌కు చెందిన యువతకు నా సంస్థలతోపాటు, నాకున్న పరపతితో ఉపాధి అవకాశాలు కల్పించా. అందరినీ కలుపుకొని పోవడం, వ్యవస్థపై అవగాహన ఉండడం, రాబోయే తరానికి దిశానిర్దేశం చేసే విజన్ వంటివి కలిసొస్తాయని భావిస్తున్నా. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమ సమయంలో అప్పటి ప్రధాని, రాష్ట్రపతిలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత తెలిసేలా అమెరికాలోని ఎన్ఆర్ఐ సెల్ ద్వారా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించా. తెలంగాణ వస్తే ఎట్లా మేలు జరుగుతుందనే విషయాలను తండాల్లోకి వెళ్లి గిరిజనులను చైతన్యవంతం చేశా. ఇలా అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉన్న తనకు ఎన్నికలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలననే నమ్మకం ఉంది.
నమస్తే : ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయాలనిపించింది?
జాన్సన్ : సీఎం కేసీఆర్ ఆశయాలు గొప్పవి. ఆయన గిరిజనుల సంక్షేమానికి ఎలా పరితపిస్తారో నేను స్వయంగా చూశా. హైదరాబాద్ లాంటి మహానగరంలో గిరిజనులకు ఎకరం స్థలాన్ని కేటాయించడమే కాకుండా, బంజారా భవన్‌ను అద్భుతంగా నిర్మించారు. ఈ భవనం ప్రారంభోత్సవానికి నేను వెళ్లినప్పుడు నా కళ్లల్లో ఆనందభాష్పాలు వచ్చాయి. ప్రతి గిరిజన, ఆదివాసీ బిడ్డలో ఒక ధైర్యం నింపేలా ఆ భవనాన్ని కట్టినందుకు అక్కడే సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేయాలనిపించింది. గతంలో పాలించిన ఏ నాయకుడు కూడా గిరిజన, ఆదివాసీల గోడు పట్టించుకోలేదు. కేవలం సీఎం కేసీఆరే గిరిజనులకు అన్ని విధాలుగా అండగా నిలిచి, వారి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. రాష్ట్రంలోని వందలాది తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఒక తండాలో పుట్టిన గిరిజన బిడ్డ నేడు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం సీఎం కేసీఆరే. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు రూ.20 లక్షల వరకు సాయం చేయడమంటే మామూలు విషయం కాదు. అలాగే ఔత్సాహిక గిరిజన బిడ్డలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఎలాంటి ష్యూరిటీలు లేకుండా కోటి రూపాయల వరకు రుణాన్ని ఇచ్చేది కూడా ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇలా అనేక రకాలుగా గిరిజనుల అభివృద్ధికి పాటు పడుతున్న సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని మా జాతి కోసం ఏదైనా చేయాలన్న దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చా.
నమస్తే : కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు మీ వద్ద ఉన్న వ్యూహం ఏమిటీ?
జాన్సన్ : నియోజకవర్గంలో ఇప్పటికే ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందింది. ఈ పథకం సీఎం కేసీఆర్ వల్లే మీ ఇంటికి చేరిందని, మళ్లీ సీఎంగా కేసీఆర్ రావాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న మేలును గుర్తు చేయడమే మా పని. కాంగ్రెస్, బీజేపీలకు చెప్పుకునేందుకు ఏమీ లేదు. వారు ఏది చెప్పినా ప్రజలు నమ్మరు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఏళ్లు కాంగ్రెస్ పాలించినా, ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అలాగే పదేండ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప రాష్ట్రాభివృద్ధికి నయా పైసా మంజూరు చేయలేదు.