దస్తురాబాద్, నవంబర్ 5 : కడెం మండలంలోని దోస్తునగర్ గ్రామ సమీపంలోని కవ్వాల్ అభయారణ్యంలోని దట్టమైన అటవీ ప్రాంతం నమో నారసింహ స్మరణతో మార్మోగింది. కొండపై ఉన్న గుహలో స్వయంభూగా వెలిసిన శ్రీ నల్గొండ నరసింహస్వామి దర్శనం కోసం మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల ప్రజలు బారులుతీరారు. డప్పుచప్పుళ్ల మధ్య పిల్లాపాపలతో పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కార్తీక మాసాన్ని పురష్కరించుకొని భక్తులు ప్రతి సంవత్సరం ఒక్కసారి ఉపవాసాలతో నరసింహుడి దర్శనానికి వెళ్తారు. ముందుగా చిన్నయ్య, నడ్పయ్య స్వామి ఆలయ అర్చకుడు కొండమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అభిషేకాలు, పూజలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని ఎస్ఐ జ్యోతిమణి, పోలీస్ సిబ్బంది, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు దర్శించుకున్నారు. అనంతరం కొండ కింద ఉన్న వాగు పక్కన గ్రామ కమిటీ, గ్రామపెద్దల ఆధ్వర్యంలో స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు కార్తీక వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.