పానిండియా అగ్రనటుడు ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తర్వాతి సినిమా ‘ఫౌజీ’కి సంబంధించిన తన భాగాన్ని సైతం ప్రభాస్ పూర్తిచేశారు. ఈ సినిమా వేసవిలో గానీ, దసరాకు గానీ విడుదల కావొచ్చని అంచనా. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా కోసం నిర్మించిన ఖరీదైన భారీ సెట్స్‌లో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కీలకమైన సన్నివేశాలను తీస్తున్నారు. ప్రభాస్, ప్రకాశ్‌రాజ్‌లపై చిత్రీకరణ జరుగుతున్నది. నిరవధికంగా 20రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ప్రభాస్‌పై పరిచయ గీతాన్ని కూడా తెరకెక్కిస్తారట. అలాగే.. 200మంది ఫైటర్స్‌తో భారీ పోరాట సన్నివేశాన్ని కూడా ఈ షెడ్యూల్లోనే పూర్తి చేస్తారట.
ఈ ఎపిసోడ్ చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇందులో ప్రభాస్ ఇప్పటివరకూ చూడని కొత్త అవతార్‌లో దర్శనమిస్తాడని, ప్రభాస్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ సినిమా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాణం: టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్.