మంచిర్యాల అర్బన్, జూలై 30 : కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల మిమ్స్ ఐఐటీ అండ్ నీట్ అకాడమీ క్యాంపస్, హాస్టల్ భవనం పై నుంచి పడి మృతి చెందిన కొత్తపల్లి సహస్ర (18) అనే ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఎదుట నిరసన తెలిపి.. అనంతరం ఐబీ చౌరస్తాలోని ప్రధాన రహదారి వద్దకు చేరుకొని రాస్తారోకో చేశారు. విద్యార్థిని మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కళాశాల భవనాన్ని సీజ్ చేయాలని, కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
2 గంటలకుపైగా ధర్నా చేయడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులతో చర్చలు జరుపుతూ మరో వైపు ట్రాఫిక్‌ను క్ల్లీయర్ చేశారు. న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుక్కూర్చున్నారు. చివరకు యాజమాన్యం దిగివచ్చి చర్చలు జరిపారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఆందోళన విరమించారు. విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యలకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్ణణ సీఐ ప్రమోద్ రావు తెలిపారు.