మంచిర్యాల, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాగజ్‌నగర్‌లో పులి మృతి చెందిన ఘటనపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ ఎద్దును చంపిందన్న కోపంతోనే విషప్రయోగం చేసి పులిని హతమార్చినట్లు విచారణలో ముగ్గురు అంగీకరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రెస్‌నోట్ విడుదల చేయడంతో పాటు ఆసిఫాబాద్ డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టేబ్రీవాల్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆసిఫాబాద్ డివిజన్ వాంకిడి మండలం వెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రెంగరీట్ గ్రామానికి చెందిన కోవా గంగు, ఆత్రం జల్పతితో పాటు 11 ఏళ్ల బా లుడు విషప్రయోగం చేసిన వారిలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా నిందితులను కోర్టులో హాజరు పరచగా, గంగు, జల్పతికి 12 రోజుల జుడీషియల్ కస్టడీని కోర్టు విధించిందని చెప్పారు. మైనర్‌ను పేరెంటల్ బాండ్‌పై రిలీజ్(అధికారుల విచారణ కోసం ఎప్పుడు పిలిచినా రావాలి, కోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉండాలి) చేసిందని తెలిపారు. రేపటి నుంచి తదుపరి విచారణకు రావాలని కోర్టు సూచించిందని, విచారణ పూర్తయ్యాక ఘటనకు బాధ్యులైన అటవీ శాఖ సిబ్బందిపైనా చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
విషప్రయోగంతో మగ పులి ఎస్-9 మృతి చెందిన ఘటనలో అధికారులు ఈ నెల 10న కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దరిగాం గ్రామంతో పాటు సర్కేపల్లి, రెంగరీట్ గ్రామాలకు చెందిన 6 నుంచి 8 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దీంతో గడిచిన మూడు రోజులుగా ఆయా గ్రామాల్లో టెన్షన్ నెలకొంది. అరెస్టు చేసిన తమ వారిని వదిలి పెట్టాలంటూ కాగజ్‌నగర్‌లోని అటవీశాఖ కార్యాలయం ఎదుట గురువారం గ్రామస్తులు ఆందోళన సైతం చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ముగ్గురిని కోర్టులో హాజరుపరచడంతో ఉత్కంఠకు తెరపడింది.
మిగిలిన ఐదుగురిని ఇంటికి పంపేసినట్లు తెలిసింది. ఈ మూడు గ్రామాల నుంచి అనుమానితులను అదుపులోకి తీసుకున్న అ ధికారులు గురువారం ఆయా గ్రామాల్లో నూ విచారణ చేశారు. ఆధారాలు సేకరించే పనితో పాటు సీన్ రీ-కన్స్ట్రక్షన్ సైతం చేశారు. కాగా విషం తిన్నట్లు అనుమానిస్తున్న మిగిలిన పు లులతో పాటు, కనిపించకుండా పోయిన పు లుల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మూడో రోజూ పులుల జాడ కో సం 120 మంది సిబ్బందితో కూడిన 24 బృం దాలు అడవిలో జల్లెడ పట్టాయి.
ఇప్పటి వర కు మూడు పులుల పాద ముద్రలను గు ర్తించారు. కాకపోతే సదరు పులుల ఆచూకీ సీసీ కెమెరాల్లో గానీ, లైవ్ కెమెరాల్లో గానీ ఎ క్కడా రికార్డు కాకపోవడంతో వెతుకులాట కొనసాగిస్తున్నారు. పులుల ఆచూకీ తెలిసే వరకు ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగేలా ఉంది. కాగా, ఈ నెల 6న చనిపోయిన పులి.. కొట్లాటలోనే మృతి చెందిందని అధికారులు చెబుతున్నారు. అయితే విషపూరితమైన ఆహారం తిని చనిపోయిందా.. కొట్లాటలో మృతి చెందిందా అన్నదానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో రెండు పులులు మృతి చెందిన ఘటనపై జనవరి మూడో వారంలో మహారాష్ట్ర, తెలంగాణ అటవీశాఖ అధికారుల మధ్య అంతర్రాష్ట్ర సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఎన్టీసీఏ సూచనల మేరకు రెండు రాష్ర్టాల మధ్య పులుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై జాయింట్ మీటింగ్ ఉండనున్నది. అప్పటిలోగా పులుల అన్వేషణను ఒక కొలిక్కి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.