నిర్మల్ టౌన్, డిసెంబర్ 24 : రాష్ట్ర పౌర సరఫరాలశాఖ ద్వారా నిర్వహిస్తున్న ఎంఎల్ఎస్ గోదాముల్లో పని చేస్తున్న హమాలీ స్లీపింగ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హ్యాండ్లింగ్, స్పీపింగ్ వర్కర్లకు కూలి పెంచాలని ఈ నెల 14 నుంచి ఆయా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతియుత నిరసనకు ప్రభుత్వం స్పందించింది. కూలి పెంపుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 20 ఎంఎల్ఎస్ గోదాములున్నాయి. వీటిలో సుమారు 250 మంది హమాలీలు, స్పీపర్లు విధులు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నుంచి వచ్చిన బియ్యం ఆయా ఎంఎల్ఎస్ పాయింట్లో దించి అదే బియ్యం సంచులను ఆయా జిల్లాల్లోని రేషన్ షాపులకు తరలించేందుకు లారీల్లో లోడింగ్ చేస్తారు. వీటిలో పనిచేసే హమాలీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ఎంతో ప్రయోజనం చేకూరనున్నది.
వేతన పెంపు ఇలా..
ఇదివరకు హమాలీలకు క్వింటాల్‌కు ప్రభుత్వం రూ.22 ఇచ్చేది. దీని కనీస చార్జిని రూ.4 పెంచి రూ.26కి చేర్చింది. దీనికితోడు బోనస్ కింద అందించే రూ.వెయ్యి స్థానంలో రూ.300 పెంచి రూ.1300 ఇవ్వనున్నది. పండుగ సందర్భంగా కానుకగా అందించే స్వీట్‌బాక్స్ రేట్‌ను రూ.700 నుంచి రూ.800కు పెంచింది. స్పీపర్లకు సీనియారిటీని బట్టి ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.6,500 వరకు వేతనం చెల్లిస్తున్నారు. దీనికి అదనంగా రూ.వెయ్యి పెంచుతూ పౌర సరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో పని చేసే ఎంఎల్ఎస్ గోదాము కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆయా ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద స్వీట్లు పంచిపెట్టుకొని సంబురాలు చేసుకున్నారు.
కార్మికుల శ్రమను గుర్తించింది..
ఎంఎల్ఎస్ పాయింట్లో హమాలీ కార్మికులుగా, స్పీపర్లుగా పని చేస్తున్న వారికి కూలీ రేట్లు పెంచాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. దీనికి ప్రభుత్వం స్పందించింది. మార్కెట్లో నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా హమాలీ చార్జిని రూ.22 నుంచి రూ.30 వరకు పెంచాలని కోరాం. ప్రభుత్వం రూ.4 పెంచి రూ. 26 చెల్లించేందుకు ఒప్పుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేయడం సంతోషం కలిగించింది. ఈ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకుంది.
– విలాస్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి, నిర్మల్
రెండేండ్ల తర్వాత మళ్లీ పెరిగాయి..
తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక రెండుసార్లు హమాలీ కూలీ రేట్లు పెరిగాయి. 2020లో రూ.4 పెంచగా.. మరోసారి శుక్రవారం మరో రూ.4 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏండ్ల తరబడి ఎంఎల్ఎస్ గోదాం పాయింట్లలో హమాలీగా పనిచేస్తూ జీనవం సాగిస్తున్న వారికి పెరిగిన ధరలకనుగుణంగా రేట్లు పెంచడం ఆనందంగా ఉంది. ఈ పెంపుతో మా కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చినట్లయింది.
– ముత్యం, జిల్లా అధ్యక్షుడు, సివిల్ సప్లయ్ కార్మిక సంఘం
స్వీపర్లకూ వేతనాలు పెరిగాయి
ఎంఎల్ఎస్ పాయింట్ గోదాములో పని చేస్తున్న స్వీపర్లకు కూడా ప్రభుత్వం వేతనాలు పెంచింది. గతంలో స్వీపర్లకు స్థాయిని బట్టి రూ.4500 నుంచి రూ.6500 వరకు వేతనం ఉండగా.. ఇప్పుడు అదనంగా రూ.వెయ్యి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. పొద్దంతా కష్టపడి పనిచేసే హమాలీ కార్మికుల శ్రమను రాష్ట్ర పౌర సరఫరాలశాఖ గుర్తించింది. మేము ఎప్పుడు న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించినా పరిష్కరించేందుకు కృషి చేయడం చాలా సంతోషంగా ఉంది.
– బలరాం, నిర్మల్
కుట్టు కూలి కూడా పెంచింది..
హమాలీ కార్మికులకు ప్రతి ఏడాది బోనస్‌తో పాటు రెండు జతల దుస్తులను ఉచితంగా ఇస్త్తుంది. గతంలో రూ.వెయ్యి కూలీ ఇవ్వగా.. దాన్ని రూ.300కు పెంచింది. మార్కెట్లో కుట్టు కూలి పెరగడంతో మా కూలి చార్జీలు పెంచాలని విజ్ఞప్తి చేశాం. దీంతో ప్రభుత్వం స్పందించి కుట్టు కూలి పెంచింనందుకు చాలా సంతోషంగా ఉంది.
– శివాజీ, హమాలీ, ముథోల్