కన్నెపల్లి : భార్యపై అనుమానం పెంచుకొని తాగుడుకు బానిసై అదే మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన ( Murder ) ఘటన మంచిర్యాల( Mancherial ) జిల్లా కన్నెపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై గంగారం తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుపల్లి గ్రామానికి చెందిన ముడిమడుగుల తులసి ( 35 )ని భర్త ముడిమడుగుల తిరుపతి బుధవారం రాత్రి గొడ్డలితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందిందని వెల్లడించారు.
ఈ విషయాన్ని భర్త గురువారం బంధువులకు చెప్పడంతో విషయం గ్రామమంతా పాకింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా తాండూర్ సీఐ కుమారస్వామి, ఎస్సై గంగారాములు ఘటన స్థలానికి చేరుకొని శవపంచనామ చేశారు. మృతురాలి తండ్రి దుర్కే శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగారం వివరించారు.