చెన్నూర్, జూన్ 3 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు ముదిరాయి. ఇన్నాళ్లుగా లోపలే పరిమితమై ఉన్న విభేధాలు ఇప్పుడు బహిరంగంగా ప్రదర్శనకు దిగాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో బహిర్గతమయ్యాయి. చెన్నూర్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంస్థత గత సమేశాల సందర్భంగా వెలుగులోకి వచ్చిన తాజా సంఘటనలు, పార్టీ అంతర్గత సమస్యలు ప్రతి బింబిస్తున్నాయి. కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అనుకూలంగా ఉన్న ఒక వర్గం, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి నేతృత్వంలోని మరోవర్గం గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవల చెన్నూర్‌కు పార్టీ పరిశీలకుడు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై మూల రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో రాజిరెడ్డి మాటలు వివాదస్పదం కావడంతో, అప్పట్లో ఎమ్మెల్యే వివేక్‌కు అనుకూలంగా ఉన్న కొందరు కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి మూల రాజిరెడ్డిపై విమర్శలు చేశారు. అయితే దానికి కౌంటర్‌గా మూల రాజిరెడ్డి తన వర్గానికి చెందిన నాయకులతో మంగళవారం చెన్నూర్‌లోని తన ఫంక్షన్ హాల్లో అంతర్గత సమావేశం నిర్వహించారు. అనంతరం రాజిరెడ్డి తరఫున తన వర్గం నాయకులు పోగుల సతీశ్, ముత్యాల రవికుమార్, స్వామి, స్వరూప్‌సింగ్ చెన్నూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి, ఎంపీగా వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన మూల రాజిరెడ్డిపై విమర్శలు చేయడం వారికి తగదని హెచ్చరించారు. ఇలా పరస్పర విమర్శలపై ఈ గ్రూపు రాజకీయాలు ఎక్కడికి దారి తీస్తాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.