రామకృష్ణాపూర్, జూలై 16 : ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం గాంధారి ఖిల్లా జనసంద్రమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. కోట మైసమ్మ నుంచి గాంధారి మైసమ్మ వద్దకు మహిళలు బోనాలు ఎత్తుకొని శోభాయాత్రగా తరలివచ్చారు. ఈ సందర్భంగా డప్పుల దరువు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. మైసమ్మకు ప్రముఖులు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వంటావార్పు నిర్వహించుకొని సహపంక్తి భోజనం చేశారు. మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామ శివారు-క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డులో గల జాతీయ ప్రధాన రహదారి పైన కొలువుదీరిన గాంధారి మైసమ్మ వద్ద ఆషాఢమాసం బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గాంధారి ఖిల్లాలో గల కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ తీసుకొచ్చి అందాల గాంధారివనం సమీపంలో కొలువైన మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఇందులో భాగంగా జాతరకు కౌన్సిలర్ తిరుపతి, బొక్కలగుట్ట సర్పంచ్ బొలిశెట్టి సువర్ణ ముఖ్య అతిథులుగా హాజరై బోనమెత్తుకున్నారు. బొక్కలగుట్ట పాలవాగు వద్ద 108 బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పుచప్పుళ్లు, శివసత్తులు, జోగినులు, భక్తుల నృత్యాలతో ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, కౌన్సిలర్లు శ్రీలత, సత్త య్య, అనిల్‌రావు, ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు భారీగా తరలిరావడంతో అందాల గాంధారి వనంలో గల చిల్డ్రన్ పార్కు కిక్కిరిసింది. జాతరకు ఉమ్మడి జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు సుమారు 15 వేల మంది తరలివచ్చారు. మేకలు, కోళ్లతో మొక్కలు సమర్పించారు. చిల్డ్రన్ పార్కు, మైసమ్మ దేవాలయం మధ్య నూతనంగా నిర్మించిన మంచిర్యాల, చంద్రాపూర్ నేషనల్ హైవేపై, జీఎం గార్డెన్ సమీపంలో భారీ సంఖ్యలో వాహనాలను పార్క్ చేసి, వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ పూస్కూరి రాంమోహన్‌రావు, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ మొక్కులు చెల్లించుకున్నారు.
భారీగా పోలీసు బందోబస్తు
అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో ముగ్గురు సీఐలు, 14 మంది ఎస్సైలు, 60 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 70 మంది కానిస్టేబుళ్లు, 40 మంది హోంగార్డులు బందోబస్తు నిర్వహించారు. రామకృష్ణాపూర్ ఎస్సై అశోక్ పర్యవేక్షణ చేశారు. జాతరలో పోలం సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సభ్యులు సుధాకర్, కందునూరి రాజన్న, వేనెంక కుమార్, పెద్దమనిషి కనకయ్య, గుండా మల్లేశ్ పాల్గొన్నారు.