ఆదిలాబాద్, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల ఆదివాసీ గూడేలు, తండాల్లో నివసించే ప్రజలు రవా ణా పరంగా ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం లో వాగులు, వంకలు పొంగడంతో రాకపోకలకు అం తరాయం కలుగుతుంది. దీంతో గర్భిణులకు ప్రసవ సమయం వచ్చినప్పుడు ఆస్పత్రులకు చేరుకోలేక తల్లీబిడ్డలు మరణించిన ఘటనలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, ఆసిఫాబాద్ ఆస్పత్రుల్లో జననీ నిరీక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో గర్భిణుల కోసం ప్రత్యేక బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గర్భిణులను ప్రసవ సమయం కంటే పది రోజులు ముందుగానే వైద్య సిబ్బంది 102 వాహనాల్లో ఈ కేంద్రాలకు తరలిస్తారు. వైద్యులు గర్భిణుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతోపాటు వారికి పౌష్టికాహారం అందజేస్తారు. ప్రసవం అనంతరం వారికి కేసీఆర్ కిట్, తల్లీబిడ్డలకు అవసరమైన మందులు అందజేసి వాహనాల్లో ఇంటివద్ద దించుతారు. మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు మంచి ఫలితాలను ఇవ్వడంతో మరికొన్ని బర్త్ వెయిటింగ్ రూంలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
కొత్తగా 11 జననీ నిరీక్షణ కేంద్రాలు
మరో 11 పీహెచ్సీల్లో బర్త్ వెయింటింగ్ రూంల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, గుడిహత్నూర్, ఇచ్చోడ, ఝరి, గాదిగూడ, భీంపూర్.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాకిండి, రోంపెల్లి, గిన్నేధరి, కౌటాల, బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బర్త్ వెయింటింగ్ రూంలు ఏర్పాటు చేయనున్నారు. జననీ నిరీక్షణ కేంద్రాల సంఖ్య 15కు చేరనుండడంతో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోతాయి.