ఎదులాపురం, మార్చి 26 : ఆదిలాబాద్ పట్టణంలో మూడు దశాబ్దాల్లో ఎప్పుడు లేని విధంగా నీటి ఎద్దడి కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కౌన్సిలర్లు ఆరోపించారు. బుధవారం కలెక్టర్ రాజర్షితోపాటు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరో రెండు నెలల్లో నీటి ఎద్దడి అతి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున దీనిపై ప్రత్యేక దృష్టి సాధించాలని కోరారు.
అదేవిధంగా లాండసాంగి వద్ద రెండు చెక్ డ్యాంలు నిర్మించాలని, మావల వాటర్ వద్ద మట్టి పూడికతీత తీయాలని, పట్టణంలో మరో 10 వాటర్ ట్యాంకర్లు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీలలో ఉన్న ప్రతి వాటర్ ట్యాంకు వద్ద మరో పెద్ద బోరు వేసి వాటి నీటిని ట్యాంకు ఎకించాలన్నారు. నిర్మల్ నుంచి మిషన్ భగీరథ నీరు కూడా నిరంతరంగా వచ్చేటట్లు చేయాలన్నారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వీరిని కలిసిన వారిలో జహీర్ రంజానీ, కలాల శ్రీనివాస్, బండారి సతీష్, సంద నర్సింగ్, ఆవుల వెంకన్న, దర్శనాల లక్ష్మణ్, ఇజ్జగిరి సంజయ్ ఉన్నారు.