బయ్యారం, ఆగస్టు 15 : మట్టి మనుషుల దేశభక్తికి మువ్వన్నెల జెండా మురిసిపోయింది. ప్రకృతి ఒడిలో పంట పొలాలు ముచ్చటపడేలా స్వచ్ఛమైన మనసుతో చేసిన ఆత్మీయ వందనానికి జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ‘మాకూ దేశభక్తి ఉంది.. మేమూ జెండా పండుగలో పాల్గొం టాం’ అంటూ మహిళా కూలీలు వారు పనిచేసే వరి పొలంలో జెండాను ఎగరేసి, జాతీయ గీతాన్ని ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని గంగాబజార్కు చెందిన మహిళా కూలీలు వెంకట్రాంపురం శివారులోని ఓ రైతు పొలంలో నాటు వే సేందుకు వెళ్లారు. అక్కడే స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు. నారు కట్టలను కుప్పగా పోసి, జెం డా కర్ర ఏర్పాటు చేసి జాతీయ జెండాను కట్టి, ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇది చూసిన పలువురు స్థానికులు దేశభక్తంటే.. ఇది కదా అంటూ వారిని మెచ్చుకున్నారు.
నర్మెట, ఆగస్టు 15: జాతీయ జెండా ఆవిష్కరణ ఏర్పాట్లలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణపై పెద్ద మనుషుల సమక్షంలో విచారిస్తుండగా ఒకరు కత్తితో దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో కొందరు యువకులు చందాలు వేసుకొని బుధవారం రాత్రి జాతీయ జెండావిష్కరణ ఏర్పాట్లు చేశారు. ఈ విషయంలో గోల్కొండ శ్రీనివాస్, కంతి స్వామికి బుధవారం రాత్రి గొడవ జరిగింది. గురువారం ఉదయం జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పెద్ద మనుషులు రాత్రి ఎందుకు గొడవ జరిగిందని స్వామిని, శ్రీనివాస్‌ను పిలిచి విచారించారు. శ్రీనివాస్ పెద్ద మనుషులు చెప్పింది వినకుండా అక్కడ నుంచి తిట్టుకుంటూ వెళ్తుండగా స్వామి, అతడి తమ్ముడు రవి ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించారు. దీంతో శ్రీనివాస్ తన వద్ద ఉన్న కత్తితో స్వామి, రవిపై దాడి చేశాడు. ఈ ఘటనలో స్వామికి తీవ్రగాయాలవడంతో హైదరాబాద్‌లోని నీలిమా ఆస్పత్రికి తరలించారు. కంతి రవి స్వల్ప గాయాలు కాగా, అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు ఎస్సై నగేశ్ తెలిపారు.