తాండూర్ : కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం తగినంత యూరియాను ( Urea ) సరఫరా చేయడంలో విఫలం కావడంతో తాండూరు మండలం రేచిని గ్రామంలో రైతులు ఇక్కట్లకు గురవుతున్నారు. పీఏసీఎస్ గోదాంకు బుధవారం 12 టన్నుల యూరియా రావడంతో రైతులు ఎగబడ్డారు. ఉదయం నుంచే ఎరువుల విక్రయ కేంద్రం వద్ద క్యూ లైన్లు కట్టారు. వంతుల కోసం కేంద్రం ఎదుట చెప్పులను నిలిపి ఇతర పనులు చూసుకునేందుకు వెళ్లారు.
కేంద్రానికి వచ్చిన రైతులకు తగినంత యూరియా లేకపోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో పీఏసీఎస్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవను సద్దుమణిగించారు. వరుసలో ఉన్న రైతులకు ఒక్కొక్క యూరియా బస్తా చొప్పున అందించారు. బస్తాలు అందని వారు నిరాశగా వెనుదిరిగారు. కాంగ్రెస్ సర్కార్ చేతకానితనం వల్లనే యూరియా తిప్పలు ఏర్పడుతున్నాయని క్యూలో నిల్చొని యూరియా అందని రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.