చెన్నూర్ రూరల్, డిసెంబర్ 28 : చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామ సమీపంలోని వరలక్ష్మి జిన్నింగ్ మిల్లులో పత్తికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. మంగళవారం వరకు పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ. 7520 ఉండగ, ప్రస్తుతం క్వింటాలుకు రూ. 100 తగ్గించారని, తగ్గించిన రూ. 100 తిరిగి పెంచాలని డిమాండ్ చేశారు.
రోడ్డుకు అడ్డంగా బండ్లు, ట్రాక్టర్లు పెట్టి సుమారు రెండు గంటల పాటు ధర్నా చేయగా, ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. చెన్నూర్ సీఐ రవీందర్, సీపీవో రైతులతో మాట్లాడి నచ్చ జెప్పడంతో వారు ధర్నాను విరమించారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మిల్లు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు. జిల్లా స్థాయి అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించేలా చూడాలని వారు కోరుతున్నారు.