లక్షెట్టిపేట, ఆగస్టు 5 : ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు చేపట్టనున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే కు భూములియ్యమని, బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని రైతులు తెగేసి చెప్పారు. సోమవారం పట్టణంలోని ఎస్పీఆర్ గార్డెన్స్‌లో నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల అదనపు కలెక్టర్ మోతీలాల్ అధ్యక్షతన పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్, మంచిర్యాల, మందమర్రి మండలాల్లో భూములు కోల్పోతున్న రైతులను పిలిచి అభిప్రాయాలు సేకరించారు. హైవేలో ఎవరిది ఎంత భూమి పోతుందని, ఎంత పరిహారం ఇస్తారన్న అంశంపై చర్చిస్తారనుకున్న రైతులను.. హైవే నిర్మాణం చేపడితే పర్యావరణం ఎలా ఉంటుందో చెప్పాలంటూ అధికారులు ప్రశ్నించడంతో వారు అవాక్కయ్యారు.
ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో విలువైన భూములు లాక్కున్నారని, అప్పుడు ఇచ్చిన అరకొర పైసలు తమకు అక్కరకు రాలేదని, మళ్లీ ఇప్పుడు హైవే కోసం భూములు లాక్కోవాలని చూడడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు. తమ భూములు పోతే చావేనంటూ కంట తడి పెట్టారు. సమావేశానికంటే ముందు గ్రామ సభలు నిర్వహించి ఎంత భూమి పోతుంది.. ఎంత పరిహారం వస్తుంది.. రైతుకు సమ్మతమేనా అని తెలుసుకున్నాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గతంలో ఇదే హైవే కోసం చేసిన సర్వేను ఎందుకు క్యాన్సిల్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న రోడ్డును వెడల్పు చేయడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని చెప్పి.. అంతా సిద్ధం చేసి మళ్లీ ఇప్పుడు సర్వే ఏమిటని నిలదీశారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదంటూ సుమారు 100 మంది రైతులు తమ అభిప్రాయాలతో కూడిన వినతిపత్రాలను ఆర్డీవోకు అందజేశారు.
అంతే గాకుండా రైతులకు భూ పరిహారంపై స్పష్టత ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ సభా ప్రాంగణంలో బైఠాయించారు. జాయింట్ కలెక్టర్ మోతీలాల్ కలగజేసుకొని రైతులు ఇచ్చిన ఫిర్యాదులు మొత్తం అధికారుల దృష్టికి తీసుకుపోయి న్యాయం చేస్తానని చెప్పడంతో రైతులు శాంతించారు. ఆర్డీవో రాములు, ఎన్‌హెచ్ నిజామాబాద్ జిల్లా ఈఈ వంశీకృష్ణ, పీడీ అజయ్ మణికుమార్, ఎన్‌హెచ్ ఇన్చార్జి తహసీల్దార్ సత్యనారాయణ, పార్టీల నాయకులు పాల్గొన్నారు.