మంచిర్యాల, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా నాయకులు మూలరాజిరెడ్డి, అనిల్, రవికాంత్లపై పెట్టిన అక్రమ కేసులో జిల్లా సెషన్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేయగా, బుధవారం విడుదలయ్యారు. చెన్నూర్, క్యాతన్‌పల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి నుంచి వేలాదిగా జైలు వద్దకు తరలిన శ్రేణులు, అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. జై బాల్క సుమన్.. జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఆదిలాబాద్ నుంచి వందలాది వాహనాల్లో ర్యాలీగా బయలుదేరిన బాల్క సుమన్‌కు దారి పొడువునా నీరా‘జనం’ పలికారు.
ఆదిలాబాద్, ఉట్నూర్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట ఇలా ప్రధాన కూడళ్లలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేస్తూ ముందుకు కదిలారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలుసుకుంటూ మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చారు. స్థానిక ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, జై తెలంగాణ నినాదాలు చేశారు. పటాకులు కాల్చారు. మంచిర్యాల నుంచి క్యాతన్‌పల్లిలోని స్వగృహానికి వచ్చిన ఆయనకు కుటుంబ సభ్యులు, చెన్నూర్ నియోజకవర్గ మహిళా నాయకులు స్వాగతం పలికారు. బాల్కసుమన్ భార్య రాణి అలేఖ్య హారతి ఇచ్చి బొట్టు పెట్టారు.
దిష్టి తీసి ఇంట్లోకీ తీసుకెళ్లారు. 16 రోజులు జైలులో ఉండి ఇంటికి వచ్చిన కొడుకును చూసి బాల్కసుమన్ తల్లి ఒక్కసారిగా మీదపడి కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులతో కాసేపు గడిపిన తర్వాత తన కోసం వచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో మమేకమయ్యారు. వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టించి, పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, వివిధ మండలాల బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్వీ నాయకులు ఉన్నారు.