ఉట్నూర్, ఆగస్టు 23 : స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు గడస్తున్నా.. ఆదివాసులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. కనీసం కూడు, గూడు, గుడ్డ, భూములకు హక్కు పత్రాలు కావాలని ఏండ్లుగా పోరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను కట్టుకోడానికి టైగర్, బఫర్ జోన్ పేరిట అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఆదివాసుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన చట్టాలు అమలు చేయకపోగా.. ఉన్న జీవోలు సవరిస్తూ అన్యాయానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు సోమవారం మరోసారి తుడుందెబ్బ, అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ‘చలో ఉట్నూర్’ పేరిట ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడికి నడుం బిగించారు. ఇప్పటికే గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిస్తున్నారు. దీంతో గిరిజన గ్రామాల నుంచి భారీ ఎత్తున ఆదివాసులు పిల్లాపాపలతో రానున్నారు.
జీవో నంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ ఉద్యోగాలలో 75 శాతం రిజర్వేషన్ ఆదివాసులకే ఇవ్వాలి. l జీవో ఎంఎస్ నంబర్ 3ని యథావిధిగా కొనసాగించాలి. l తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 120 రాయిసెంటర్లకు పక్కా భవనాలు నిర్మించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీవో నంబర్ 49 ను శాశ్వతంగా రద్దు చేయాలి. l టైగర్‌జోన్ పేరిట ఆదివాసీ గూడేలని తరలించే ప్రయత్నాలను ఫారెస్ట్ అధికారులు విరమించుకోవాలి. l బఫర్, కోర్ ఏరియాల పేరిట ఆదివాసులకు మంజూరైన ఇండ్లను అడ్డుకునే ప్రక్రియను నిలిపివేయాలి. l దేశవ్యాప్తంగా ఆదివాసు లపై జరుగుతున్న ఫాసిస్టు దాడులను అరికట్టాలి.
ఏజెన్సీలో యువతకు అన్యాయం జరుగుతుంటే.. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామవి పక్కన పడేసిందని ఆరోపిస్తున్నారు. కంటితుడుపు చర్యగా ఇటీవల పోలీస్ రిక్యూర్మెంట్కై కొన్ని పోస్టులు విడుదల చేసిందన్నారు. అందులో కూడ జిల్లాలో ఉన్న కొద్దిపాటి పోస్టులున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలకు 75 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎలా కేటాయిస్తారో అర్థంకావడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ప్రకటించిన రోస్టర్‌లో ఏజెన్సీకి ప్రాంతానికి తక్కువ పోస్ట్‌లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
ఇలా అయితే ఏజెన్సీ నిరుద్యోగులు చాలా నష్టపోతారని, తక్కువ పోస్టులు వచ్చే అవకాశాలున్నాయని ఆదివాసీ నిరుద్యోగ లోకం భగ్గుమంది. ఇందులో భాగంగా ఏజెన్సీ బంద్‌ను నిర్వహించి ప్రభుత్వానికి గట్టి సవాల్ విసిరారు. గత ప్రభుత్వం ఏజెన్సీ రిజర్వేషన్లను పరిగణలోనికి తీసుకొని నోటిఫికేషన్లు ఇచ్చిందని, ఈ ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుందంటున్నారు. ఆదివాసులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు.
ఏజెన్సీ 5వ షెడ్యూల్ ప్రాంతం అయినందున గిరిజన యువతకు ప్రత్యేక ఉద్యోగావకాశాలు కల్పించాలి. జనరల్ జీవోల ప్రకారం రిక్రూట్మెంట్ చేపట్టడం ద్వారా ప్రత్యేక చట్టాలున్న గిరిజన యువతకు అన్యాయం జరుగుతుంది. కావున ఏజెన్సీకి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ నిర్వహించారు. 109 జీవో ప్రకారం షెడ్యూల్ ఏరియాకి 75 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. గత ప్రభుత్వాలు ప్రతి నోటిఫికేషన్లు ఇలానే ఇచ్చి గిరిజనులకు న్యాయం చేశాయి. ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు సహకరించకుంటే ఊరుకునేదిలేదు.
-పెందూర్ దాదిరావు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు, ఉట్నూర్.