ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : ఉద్యోగులకు పెన్షన్ ( Pension ) భిక్ష కాదని అది వారి హక్కు అని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు లింగాల రాజశేఖర్ (JAC President Rajasekhar) అన్నారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో ( Block Badges ) నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ( Collector Venkatesh ) కు వినతి పత్రం అందజేశారు.
ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సీపీఎస్ ( CPS ) రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ పదవి విరమణాంతరం పెన్షన్ పొందడం ఉద్యోగి హక్కు, అది ప్రభుత్వ దయాధర్మమో, భిక్షనో కాదని భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ విధానాలను అమలు చేస్తూ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. దేశంలో పశ్చిమ బెంగాల్, త్రిపురలో పాత పెన్షన్ విధానమే కొనసాగుతుందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో లక్షా నలభై వేల మంది సీపీయస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు , వారి కుటుంబాలు సామాజిక భద్రత పట్ల ఆందోళన చెందుతూ ప్రశాంతతలేని జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు జిల్లా వైద్యాధికారి సీతారాం మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శాంతి కుమారి, ఉమర్ హుస్సేన్, ఉషన్న, హేమంత్ షిండే, ఊశన్న, ఏటుకూరి శ్రీనివాసరావు, తుకారం, సదాశివ్, ఖమర్ హుస్సేన్, శ్రీపాద, వలి ఖాన్, భాగ్యలక్ష్మి కలెక్టరేట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.