హాజీపూర్/మంచిర్యాల అర్బన్/చెన్నూర్ టౌన్/మందమర్రి/రెబ్బెన/తాండూర్/ కోటపల్లి/సీసీసీ నస్పూర్/బెజ్జూర్/లక్షెట్టిపేట/ కాగజ్‌నగర్/ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, అక్టోబర్ 13 : తొమ్మిది రోజుల పాటు వివేష పూజలందుకున్న దుర్గమ్మ నిమజ్జనం ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైభవంగా అలంకరించిన వాహనాల్లో పురవీధుల గుండా భాజా భజంత్రీల నడుమ శోభాయాత్ర తీశారు. అనంతరం ఆయా గ్రామాల సమీపంలోని చెరువులు, గోదావరిలో నిమజ్జనం చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వాహకులు శోభయాత్రలు నిర్వహించారు. గోదావరికి తరలించి అమ్మవారి నిమజ్జనం చేశారు. విశ్వనాథ దేవస్థాన కాలక్షేప మండపంలో సర్వజననీ దుర్గామాత నిర్వాహక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జనం నిర్వహించారు. బెంగాలీ మహిళలు కోలాటాల, నృత్యాలు చేస్తూ అమ్మవారి శోభాయాత్ర కొనసాగించారు. చెన్నూర్ పట్టణంలో నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు డీజే సౌండ్స్‌కు నృత్యాలు, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. భవానీ మండలి డప్పు చప్పుళ్లు, గుస్సాడీ నృత్యాలతో అలరించారు. స్థానిక పెద్ద చెరువు, గోదావరిలో నిమజ్జనం చేశారు. కొన్ని మండపాల వద్ద వాహనాలకు లాటరీ నిర్వహించారు. చీరలు, కళశాల కోసం వేళం వేశారు.
మందమర్రి పట్టణంలోని మార్కెట్, పాలచెట్టు ఏరియా, వివిధ కార్మిక కాలనీలతో పాటు శ్రీపతినగర్, దీపక్‌నగర్, పాతబస్టాండ్, యాపల్ ఏరియాల్లో యువకులు, ప్రజలు, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో దుర్గామాతకు మేళతాళాలు, నృత్యాలు, మంగళహారతులతో వీడ్కోలు పలికారు. నిర్వాహకులు మంచిర్యాల, గోదావరిఖని సమీపంలోని గోదావరికి అమ్మవార్ల ప్రతిమలను తరలించారు. మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అమ్మవారి చీరలు, కళశాలకు వేలం వేశారు. రెబ్బెన మండలం ఇందిరానగర్‌లో కొలువైన కనకదుర్గాదేవి స్వయంభూ మహంకాళి దేవస్థానంలో ఏర్పాటు చేసిన అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు ఒడిబియ్యం, నైవేద్యాలు సమర్పించారు.
ఎమ్మెల్సీ దండేవిఠల్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవాలను ముగించారు. పల్లకీసేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోటపల్లితో పాటు, చెన్నూర్ పట్టణానికి చెందిన దుర్గామాత ప్రతిమలను రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద ప్రాణహిత నదిలో నిమజ్జనం చేశారు. చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీసీసీ నస్పూర్‌లోని ఆయా మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించి గోదావరిలోనదిలో నిమజ్జనం చేశారు.
సీఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సీసీసీ నస్పూర్ ఎస్ఐ నెల్కి సుగుణాకర్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెజ్జూర్ మండల కేంద్రంతో పాటు, ఎల్కపల్లి, కుశ్నపల్లి, కుకుడ తదితర గ్రామాల్లో.. లక్షెట్టిపేట, కాగజ్‌నగర్ పట్టణాలోల అమ్మవారి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లోని శారద గణేశ్ మండలి వద్ద నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో థార్ వాహనానికి లకీ డ్రా నిర్వహించారు. విజేతను ఎంపిక చేయడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీపీ బాలేశ్ గౌడ్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు చిలువేరు వెంకన్న, గంధం శ్రీనివాస్ హాజరై, కూపన్ తీయగా, కౌటాల మండల కేంద్రానికి చెందిన కుదురుపాక సురేశ్ విజేతగా నిలిచారు.