ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 10: గత సంవత్సరం కంటే ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో మండలంలోని చెరువులన్నీ నిండుకుండలా మారాయి. ముఖ్యంగా మండలంలోని గోపాయి, ఎల్లమ్మ, సరస్వతీ చెరువులు జలకళను సంతరించుకున్నాయి. లక్కారంలోని బాయమ్మకుంట, నేరెళ్ల, గంగన్నపేట్ చెరువులు, మత్తడిగూడలోని మత్తడి ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. దంతన్పెల్లిలోని నరసింహచెరువు, చెరువుగూడ చెరువులతో పాటు బీర్సాయిపేట్లోని పెద్దచెరువు, భూపేట్ చెరువుల్లోనూ పుష్కలంగా నీళ్లున్నాయి. వానకాలంలో సాగు చేసిన వరి పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. వరి పంటకు సరిపడా నీరుండడం, తెగుళ్లు లేకపోవడంతో పంటపైన భారీగా ఆశలు పెంచుకున్నారు.
ఉట్నూర్లో సుమారు 500 ఎకరాలు, లక్కారంలో 800, దంతన్పెల్లిలో 600, బీర్సాయిపేట్లో 200 ఎకరాల్లో రైతులు వరి సాగుచేస్తున్నారు. ప్రస్తుతం వరికోతలు ఊపందుకున్నాయి. కూలీల కొరత అధికంగా ఉంది. వరి కోత యంత్రాలు అందుబాటులో ఉండడంతో రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతున్నది. కూలీల కొరత సమస్యకు పరిష్కారం దొరికింది.
నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేసిన. ఈ సంవత్సరం పంట మం చిగా పండింది. సుమా రు 140 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట కోత సమయంలో కూలీ లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రస్తుతం వరి కోత యంత్రాలు అందుబాటులోకి రావడంతో సమయంతో పాటు ఖర్చులు తగ్గుతున్నాయి.
బండి నాగన్న, రైతు, గంగాపూర్