తాండూర్, మే 15 : జూన్లో చేపట్టే హరితహారం కార్యక్రమానికి ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని అధికారులు, సిబ్బందిని అడిషనల్ డీఆర్డీవో దత్తారావు ఆదేశించారు. అభివృద్ధి పనులపై తాండూర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో ఎంపీడీవో పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో చేపట్టే హరితహారం కార్యక్రమానికి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
స్థలాలను గుర్తించి గుంతలు తవ్వాలని తెలిపారు. ప్రతి గ్రామంలో 200 మందికి పైగా ఈజీఎస్ కూలీలు హాజరయ్యేలా చూడాలని, ప్రతి ఒక్కరికీ రోజుకు రూ.300 చొప్పున కూలి వచ్చేలా పనులు చేయించాలన్నారు. అనంతరం ఓహెచ్ఎస్ఆర్, మిషన్ భగీరథ, బోర్వెల్ మోటార్లను పరిశీలించారు. నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సత్యనారాయణ, ఏపీవో నందకుమార్, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.