మంచిర్యాల అర్బన్/చెన్నూర్/లక్షెట్టిపేట/తాండూర్/కాసిపేట, మే 20 : కార్పొరేట్ సంస్థలు తీసుకువచ్చిన ఆన్లైన్ మందుల విక్రయాల జీవోను వెంటనే రద్దు చేయాలని మంచిర్యాల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు ఒకరోజు దేశవ్యాప్త బంద్‌లో భాగంగా మంచిర్యాల జిల్లాలో కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాప్‌ల నిర్వాహకులు దుకాణాలను మూసివేసి నిరసనలు చేపట్టారు.
అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మోటూరి చంద్రశేఖర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోగరు సుధాకర్ మాట్లాడుతూ.. ఆన్లైన్లో అన్ని రకాల మందులు విక్రయించడం ద్వారా మెడికల్ షాపుల నిర్వాహకులు ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో మందుల విక్రయాల జీవోను కేంద్రం ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మెడికల్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, మెడికల్ దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు. అలాగే చెన్నూర్ పట్టణంలో మెడికల్ షాపుల యజమానులు బంద్ పాటించారు.
ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ షాపులు బందు చేస్తున్నారనే ముందస్తూ సమాచారం మేరకు మందులు అవసరమున్నవారు ముందే మందులను కొనిపెట్టుకున్నారు. లక్షెట్టిపేట మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపుల యజమానులు తహసీల్దార్ దిలీప్ కుమార్‌కు వినతి పత్రం అందించారు. పట్టణంలో కలియతిరుగుతూ మెడికల్ షాపులను మూసివేయించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆది సతీశ్, ఆర్థిక కార్యదర్శి జావేద్, సభ్యులు రమేశ్, రాజేశ్, రవి, కుమార్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు. తాండూర్ మండలంలో మెడికల్ షాపుల యజమానులు దుకాణాలు మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. మండలాధ్యక్షుడు గోకర్ణం జగన్మోహన్ చారి తదితరులు పాల్గొన్నారు. కాసిపేట మండలంలో బంద్ విజయవంతమైంది. ఆన్లైన్ మందుల విక్రయాలను ఆపాలని, కార్పొరేట్ సంస్థలకు భారీ డిసౌంట్లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.