కుమ్రంభీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల టౌన్/మంచిర్యాల అర్బన్/జన్నారం/హాజీపూర్/మందమర్రి/ రెబ్బెన/దహేగాం, ఆగస్టు 18 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. సోమవారం తెల్లవారు జాము నుంచి ఉదయం 11 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో మంచిర్యాల పట్టణం జలమయంగా మారింది. 42.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
టూటౌన్ ఏరియాలోని హమాలీవాడ, సూర్యనగర్, బృందావన్ కాలనీ, సీతారామ కాలనీ, సాయికుంట, తిరుమలగిరి, ఎన్టీఆర్ నగర్, గర్మిళ్ల, స్టేషన్‌రోడ్, కాలేజీరోడ్ ప్రాంతాలు నీట మునిగాయి. మంచిర్యాల ఏసీసీ నుంచి ర్యాలీగఢ్‌పూర్ వెళ్లే దారిలో కాజ్వే పైనుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఇళ్లలోకి నీరు చేరిన బాధితులతో మాట్లాడారు.
తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా రాళ్లవాగు ఉధృతి పెరిగింది. బైపాస్ రోడ్డు నుంచి రంగంపేట మధ్య ఉన్న కాజ్వే వంతెనపై నుంచి వరద ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో రంగంపేట, పవర్ కాలనీ, పాత మంచిర్యాల, అండాళమ్మ కాలనీల వైపు రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ ప్రాంతాల ప్రజలు ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రం, జిల్లా జనరల్ దవాఖాన ఎదుట మొకాలి లోతున వరద నిలిచిపోయింది. దీంతో రోగులు, వారి బంధువులు అవస్థలు పడ్డారు. జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై కల్వర్టుపై వరద ప్రవహించడంతో గ్రామస్తులు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 32 గేట్లను ఎత్తి 1,65,632 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు 69,393 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 295 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూ సెక్కులు, నంది పంపుహౌజ్ నుంచి 3150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల పరిధిలోని గల స్టేషన్ రోడ్డులోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, భాగ్యనగర్, విద్యానగర్, టీనగర్ కాలనీ ఇండ్లలోకి నీరు చేరింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే1 సుభాష్ నగర్లో గల అండర్ బ్రిడ్జి ముంచెత్తడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వార్ధా, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిర్సూర్(టీ) సమీపంలోని హుడిలికి వద్ద వంతెనపైకి వరద పొంగడంతో మహారాష్ట్ర కు రాకపోకలు నిలిచాయి. కౌటాల మండలంలోని తాటిపల్లి వద్ద వార్దా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. పోలీసు కంట్రోల్ రూం నంబర్ 8712670551కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. రెబ్బెనలోని ఎన్టీఆర్ కాలనీలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలు, నివాస సముదాయాలు పరిశీలించారు. దహెగాం, హత్తిని, ఐనం, పెసర్‌కుంట గ్రామాల్లో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పర్యటించారు.