బెల్లంపల్లి, మార్చి 16 : ఆ బస్తీవాసులంతా అన్నీ తామై ఓ దివ్యాంగ జంటకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. నిండూ నూరేళ్లు చల్లగా ఉండాలని.. సుఖసంతోషాలతో జీవించాలని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీ(22వ వార్డు)కి చెందిన తమ్మిడి భాగ్యమ్మ-సత్తయ్య కూతురు ప్రేమలతకు చిన్నతనంలోనే పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి.
పెద్దపల్లి జిల్లా ఆదివారంపేటకు చెందిన కన్నూరి రాయమల్లమ్మ-ఓదెలు రెండో కుమారుడు రమేశ్ దివ్యాంగుడు(అంధుడు). పెద్దల ద్వారా వీరి పెళ్లి కుదిరింది. ఇరువురు నిరుపేదలు కావడంతో బూడిదగడ్డ బస్తీవాసులంతా కలిసి వీరిద్దరికీ వివాహం చేయాలని నిశ్చయించారు.
ఇంకేముంది అన్నీ తామై ఆదివారం బెల్లంపల్లి మండల శివారులోని శివాలయంలో వివాహం జరిపించారు. అందరూ కలిసి పుస్తెలు, మట్టెలు.. తదితర సామగ్రి కొని అంగరంగ వైభవంగా పెళ్లి తంతు ముగించారు. అతిథులందరికీ భోజనం పెట్టారు. మాజీ కౌన్సిలర్లు బడికెల రమేశ్, గోసిక రమేశ్, గడ్డం అశోక్‌గౌడ్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకుడు సిరిశెట్టి సత్యనారాయణ, దాసరి దుర్గ రాజేశ్, సుంకరి వెంకటేశ్ ఉన్నారు.