మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాల నిస్తున్నాయి. ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్న గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులకు అందిస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లుభరోసానిస్తున్నాయి. జిల్లాలో గతేడాది డిసెంబర్ నుంచి ఈ పథకం అమలు చేస్తుండగా, ఇప్పటి వరకు 22 పీహెచ్సీల పరిధిలో 5,812 మందికి పౌష్టికాహార కిట్లు అందించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ)
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కేఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తున్నది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు రక్తహీనతతో ప్రసవాల సమయాల్లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు అందిస్తున్న ఈ పౌష్టికాహార కిట్లు వారికి వరంగా మారుతున్నాయి.
అడవిబిడ్డలకు పోషకాహారం..
జాతీయ కుంటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రక్తహీనత శాతం 76.30గా నమోదైంది. బలవర్ధకమైన ఆహారం లేక గ్రామీణ ప్రాంత గిరిజన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులతో పాటు కౌమార దశలో ఉన్న యువతుల్లో సైతం రక్తహీనత ఉంటుంది. ప్రధానంగా ప్రసవాల సమయం ప్రా ణాంతకంగా మారుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అడవిబిడ్డలకు పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంతో పాటు ఇప్ప పూవు (మహువా) లడ్డూలను కూ డా అందిస్తున్నది. ఇటీవల దొడ్డు బియ్యానికి బదులు బలవర్ధకమైన బియ్యాన్ని (ఫోర్టిఫైడ్) సరఫరా చేస్తున్నది. ఈ బియ్యం తినడం వల్ల రక్తహీనతను నివారించే ఐరన్, గర్భస్త శిశువు వికాసానికి ఉపయోగించే ఫోలిక్ ఆమ్లం, బిటమిన్ బీ-12వంటివి ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.
22 పీహెచ్సీల పరిధిలో 5,812 కిట్లు పంపిణీ
ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ పథకాన్ని జిల్లాలో గతేడాది డిసెంబర్ నుంచి అమలు చేస్తోంది. జిల్లాలోని 22 ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకు 5,812 కిట్లు పంపిణీ చేసింది.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లలో ఉండేవి..
ప్రభుత్వం అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లలో ఖర్జూరతో పాటు రెండు ఐరన్ సిరప్లు బాటిళ్లు, అర కిలో నెయ్యి, ఆల్బండజోల్ మాత్రలు, రెండు హార్లిక్స్ బాటిళ్లు ఉంటాయి.