ఆదిలాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని ఆశ కల్పించిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుడు జే.కృష్ణ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు దండుకున్నాడు. తాను ఆదిలాబాద్, ఉట్నూర్‌లలో మైక్రో ఫైనాన్స్ కార్యాలయాలను ప్రారంభించాడు. ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాడు. వారితో సన్నిహితంగా ఉండేవాడని బాధితులు తెలిపారు.
తాను ఎన్ఆర్ఐని అని చెప్పుకుంటూ.. ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉండేవాడు. తాను చేస్తున్న మోసాలపై ఎవరికీ అనుమానం రాకుండా, నిరుద్యోగుల్లో నమ్మకం కల్పించేలా పకడ్బందీగా వ్యవహరించాడు. ఎన్ఆర్ఐని అని చెప్పుకున్న కృష్ణ డబ్బులున్న వ్యక్తిగా సూటు ధరించి, కార్లతో తిరుగుతూ, బౌన్సర్లను పెట్టుకుని పలుకుబడి గల వ్యక్తిగా, ధనవంతుడిగా నటించేవాడు. ఆయనతోపాటు స్థానికంగా ఉంటే కొందరిని తన బృందంలో కలుపుకుని నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టాడు.
ఉత్తుత్తి సేవా కార్యక్రమాలు
ఆదిలాబాద్ రిమ్స్‌లో కార్పొరేట్ వైద్యానికి ఉప యోగపడే భారీ పరికరాలను ఉచితంగా అందించినట్లు ప్రజలను నమ్మించాడు. సోషల్ మీడియా ద్వారా తన అనుచరులతో ప్రచారం చేసుకున్నాడు. ఉట్నూర్ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు నటించి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. బడా ఫైనాన్స్ సంస్థలతో తనకు పరిచయాలు ఉన్నాయని, డబ్బులు కడితే ఆ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయని తమను నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశాడని నిరు ద్యోగులు తెలిపారు.
ఆదిలాబాద్ ప్రాంతంలో 180 మంది నిరుద్యోగుల నుంచి ఉట్నూర్ ఏరియాలో 164 మంది వద్ద నుంచి దాదాపు రూ. ఒక కోటి వరకు వసూలు చేసినట్లు బాధితుల కథనం మేరకు స్పష్టమవుతుంది. ఉద్యోగం కో సం డబ్బులు కట్టిన వారిని మీ వారి స్నేహితులకు ఫైనా న్స్ ఉద్యోగాల గురించి చెప్పాలంటూ కార్యాలయం సి బ్బంది తెలిపేవారని, దీంతో తాము చాలా మంది స్నే హితులు ఈ విషయం తెలుపడంతో వారు తమకు ఉద్యోగం లభిస్తుందనే ఆశతో డబ్బులు కట్టారని బాధి తులు తెలిపారు. ఎన్ఆర్ఐ, ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉంటున్నట్లు నటిస్తూ ప్రజాప్ర తినిధులతో నిరుద్యోగులను మోసం చేసిన జే.కృష్ణపై కఠిన చర్యలు తీసుకుని, త మ పైసలు తిరిగి ఇప్పించాలని నిరుద్యోగులు కోరుతు న్నారు.
కృష్ణను వదలొద్దు..
ఉట్నూర్, జూలై 17 ః నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకున్న డిజిటల్ మెక్రో ఫైనాన్స్ ఎండీ జాదవ్ కృష్ణను, అతడికి సహకరించిన వారిని వదలొద్దని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్ఆర్ఐను అంటూ ప్రచారం చేసుకుంటూ.. తక్కువ వడ్డీకే ఫైనాన్స్ ఇస్తానంటూ ఆదిలాబాద్‌తోపాటు ఉట్నూర్, జైనూర్ మండల కేంద్రాల్లో కార్యాలయాలు ప్రారంభించాడన్నారు. ఉద్యోగాలు ఇస్తానంటూ రూ.20 వేల నుంచి రూ. 40 వేల వరకు డబ్బులు కాజేసి ఊడయించాడన్నారు. కావున వెంటనే పోలీసులు అతన్ని, సహకరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.