బేల, జనవరి 15 : బీఆర్ఎస్ నాయకులు గర్జించారు. రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బేల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకున్నది. ఇరువైపులా వాహనాలు బారులుదీరాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు బంధు అందించడంలో విఫలమైందని ఆరోపించారు. రైతు సమస్యలపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రైతుల పక్షాన ఉండాల్సిన స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వంపై నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, స్వరూపరాణి, కరుణ, ప్రమోద్‌రెడ్డి, టాక్రె గంభీర్, సతీశ్ పవర్, జకుల మధూకర్, దేవన్న, కిషన్ వైద్య, రామ్ చందర్, జితేందర్, తన్వేర్ ఖాన్, విప్పిన్ కోడె, సంతోష్ పాల్గొన్నారు.