ఆదిలాబాద్, మే 30(నమస్తే తెలంగాణ) : పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(బాస్) పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పట్టణాల్లోని వివిధ ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా చదువుకొనేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఐటీడీఏ, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశం పొందడానికి లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. గిరిజన విద్యార్థులను ఐటీడీఏ ద్వారా మూడు, ఐదు, ఎనిమిదో తరగతులు.. ఎస్సీ విద్యార్థులను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకటి, ఐదు తరగతుల్లో ఎంపిక చేస్తారు. ఈ పథకంలో భాగంగా పట్ట ణ ప్రాంతాల్లోని వివిధ పాఠశాలల్లో ఎంపికైన విద్యార్థులకు మంచి చదువులు అందడంతోపాటు ఉద్యోగా లు చేసుకొనే అవకాశం లభిస్తున్నది. తల్లిదండ్రులు త మ పిల్లలను బెస్ట్ అవైలబుల్ పథకంలో పలు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో బాస్ పథకానికి మంచి ఆదరణ లభిస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో ఆరు ప్రైవేటు పాఠశాలల్లో బాస్ పథకం కింద 1300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డే స్కాలర్, రెసిడెన్షియల్ విధానంలో పిల్లలకు చదువుకొనే అవకాశం ఉంది. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందిన విద్యార్థి పదో తరగతి వరకు ఉచితం గా విద్య అందుతుంది. డే స్కాలర్ ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఏడాదికి రూ.28 వేలు, రెసిడెన్షియల్ విద్యార్థికి రూ.42 ప్రైవేటు పాఠశాలలకు చెల్లిస్తున్నది. డే స్కా లర్ విద్యార్థులకు చదువుతోపాటు యూనిఫాంలు, బు క్స్.. రెసిడెన్షియల్ విద్యార్థులకు హాస్టల్ వసతితోపాటు చదువు, బుక్స్, యూనిఫాంలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అందిస్తాయి. విద్యార్థుల సంఖ్య మే రకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు బకాయిలు విడుదలు చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బాస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతోపాటు స్కూళ్లకు రావాల్సిన డబ్బులు అందజేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు పాఠశాలలకు రూ.12 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అధికారులను వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు పేర్కొంటున్నారు. తాము అప్పులు చేసి పాఠశాలలను నడుపుతున్నామని, ప్రభుత్వం బాస్ పథకం నిధులు విడుదల చేయకపోవడంతో నష్టపోవాల్సి వస్తున్నదని అంటున్నారు.
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు అధికారులను తమ పాఠశాలల్లోకి ఈ విద్యా సంవత్సరం నుంచి పిల్లలను అనుమతించబోమని, ఈ పథకం నుంచి తప్పుకుంటున్నట్లు వినతిపత్రాలు అందజేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని బాస్ పథకంలో ఓ ప్రైవేటు పాఠశాలలలో 420 మంది విద్యార్థులు చదువుతుండగా స్కూల్‌ను మూసివేయడంతో పిల్లల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మరి కొద్ది రోజుల్లోనే పాఠశాలలు ప్రారంభవుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు మూడేళ్ల బకాయిలు విడుదల కాకపోవడంతో గతేడాది దసరా సెలవుల తర్వాత పిల్లలను పాఠశాలలకు తీసుకురావద్దంటూ ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు సూచించారు. ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలతో కలిసి గతేడాది అక్టోబరు 13న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. బెస్ట్ పథకం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఎంపికైన తమ పిల్లల భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, ప్రభుత్వం తమ పిల్లలు చదువులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న బాస్ పథకం పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించడానికి, వారు మంచి ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడుతుంది. గతంలో మా పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎంబీబీఎస్ చదువులు చదువుతున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకొనే ఒక్కో విద్యార్థికి సర్కారు రూ.1 లక్షకు పైగా ఖర్చు చేస్తుంది. బాస్ పథకంలో కేవలం రూ.42 వేలు చెల్లిస్తున్నా వారికి మంచి రెసిడెన్షియల్ విద్యను అందిస్తున్నాం. మూడేండ్లుగా మాకు రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో అప్పులు చేసి పాఠశాలలను నడిపాం. డబ్బులు విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి పలు వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేదు. దీంతో ఈ విద్యాసంవత్సరం నుంచి పిల్లలను పాఠశాలలకు పంపొద్దని అధికారులకు వినతిపత్రాలు అందించాం.
– వేదవ్యాస్, ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు