దండేపల్లి, అక్టోబర్ 26: ఈ చిత్రంలో కనిపిస్తున్నది తాళ్లపేట పశువైద్య ఉప కేంద్రం.. ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ కేంద్రంలో గతంలో ఉన్న ఎల్ఎస్ఏ ఉద్యోగోన్నతిపై బదిలీ కాగా, ఇన్చార్జిగా ఉన్న ఎల్ఎస్ఏ ఎప్పుడు వస్తాడో..? ఎప్పుడు వెళ్తాడో తెలియని పరిస్థితి నెలకొన్నదని రైతులు మండిపడుతున్నారు. సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లినప్పుడు కేంద్రంలో మందులు ఇవ్వడానికి అటెండర్ ఉండడం లేదు.
ఇటీవల గ్రామంలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆవు సకాలంలో వైద్యం అందక మృతి చెందింది. ఈ విషయంపై దండేపల్లి మండల పశువైద్యాధికారి ధన్‌రాజ్‌ను వివరణ కోరగా తాళ్లపేట పశువైద్య ఉప కేంద్రంలో ఎల్ఎస్ఏ పోస్టు ఖాళీగా ఉండడంతో ఇన్చార్జిని నియమించామని తెలిపారు. అటెండర్ పోస్టు ఖాళీగా ఉందని, ఉన్న సిబ్బందితో వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.